తిరుమలలో ప్రారంభమయిన బ్రహ్మోత్సవాల కోలాహలం

WD PhotoWD
తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాల కోలాహలం ప్రారంభమయింది. అక్టోబర్ 1 నుంచే బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నా, ఇప్పటి నుంచే భక్తుల సందడితో కొండ ఉక్కిరిబిక్కిరవుతోంది. దసరా శెలవులు కలిసి రావడంతో బ్రహ్మోత్సవాల్లో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొనే అవకాశం ఉందని టీటీడీ అంచనా వేసింది.

బ్రహ్మోత్సవాల్లో తొలి రోజు 01/10/08 (బుధవారం) ఉదయం ధ్వజారోహణం జరుగనుంది. సాయంత్రం స్వామి వారు పెద్ద శేష వాహనంపై భక్తులకు దర్శనమివ్వనున్నారు. రెండో రోజైన 02/10/08 (గురువారం) ఉదయం చిన్న శేష వాహనంపై ఊరేగి, సాయంత్రం హంస వాహనంపై స్వామివారు పురవీధుల్లో కనిపించనున్నారు.

అలాగే 03/10/08 (శుక్రవారం) ఉదయం సింహవాహనంపై వెంకన్న భక్తులకు దర్శనమివ్వనుండగా, ఆ సాయంత్రం ముత్యపు పందిరి వాహనంపై మాడవీధుల్లో ఊరేగనున్నారు. నాలుగో రోజు 04/10/08 (శనివారం) ఉదయం శ్రీవారు కల్పవృక్ష వాహనంపై ఊరేగుతారు. ఆ సాయంత్రం సర్వభూపాల వాహనంపై దర్శనమిస్తారు.

ఐదో రోజు 05/10/08 (ఆదివారం) ఉదయం మోహినీ అవతారంలో కనిపించి, రాత్రి గరుడ వాహనంపై దర్శనమిస్తారు. ఆరో రోజు 06/10/08 (సోమవారం) స్వామివారు హనుమంత వాహనంపై ఊరేగుతారు. ఆ రాత్రి గజవాహనంపై దర్శనమిచ్చి భక్తులను తరింపచేయనున్నారు. అలాగే ఏడో రోజు 07/10/08 (మంగళవారం) ఉదయం సూర్యప్రభ వాహనంపై ఊరేగుతారు. సాయంత్రం చంద్రప్రభ వాహనంపై కనిపించి భక్తులను తరింపచేస్తారు.

ఎనిమిదో రోజు 08/10/08 (బుధవారం) ఉదయం రథోత్సవం జరుగనుంది. ఆ రోజు సాయంత్రం శ్రీవారు అశ్వ వాహనంపై దర్శనమివ్వనున్నారు. కాగా, ఆఖరి రోజైన 09/10/08 (గురువారం) ఉదయం చక్ర స్నానం జరుగనుండగా, ఆ సాయంత్రం జరిగే ధ్వజారోహణంతో ఉత్సవాలు ముగుస్తాయి.

వెబ్దునియా పై చదవండి