భూలోక వైకుంఠనాధుని బ్రహ్మోత్సవాలు బుధవారం నుంచి వైభవంగా ప్రారంభం కానున్నాయి. బుధవారం సాయంత్రం ధ్వజారోహణంతో ఈ ఉత్సవాలు ప్రారంభమవుతాయి. బుధవారం రాత్రి మలయప్పస్వామి పెద్దశేష వాహనంపై మాడవీధుల్లో ఊరేగనున్నారు.
బ్రహ్మోత్సవాల సందర్భంగా బుధవారం రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర రెడ్డి శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించేందుకు తిరుమలకు చేరుకోనున్నారు. వైఎస్సార్ రాకను పురస్కరించుకుని గట్టి భద్రతను కల్పించే దిశగా జిల్లా పోలీసు, విజిలెన్స్ యంత్రాంగం ఏర్పాట్లను పూర్తి చేసింది.
మరోవైపు... శ్రీవారి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని అతిథిగృహం వద్ద ఫల, పుష్ప ప్రదర్శన శాల ఏర్పాట్లను టీటీడీ ముమ్మరం చేస్తోంది. జీఎన్‌సీ టోల్‌గేట్ నుంచి శ్రీవారి ఆలయం వరకు నిర్ణీత ప్రదేశాల్లో రంగు రంగుల పూల తొట్టెలను అందంగా అమర్చారు. ఉత్సవాలను విజయవంతం చేసేందుకు టీటీడీలోని అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేస్తున్నాయి.