వీణాపాణియై భక్తులకు దర్శనమిచ్చిన శ్రీవారు

తిరుమలలో అత్యంత వైభవంగా జరుగుతున్న శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం రాత్రి శ్రీవారు వీణాపాణియై హంసవాహనమెక్కి భక్తుల్ని తరింపజేశారు. హంసవాహనంలో సరస్వతీ రూపంలో స్వామివారు భక్తులను కరుణించారు.

క్షీరం, నీరు న్యాయాన్ని కచ్చితంగా అమలు చేసే హంసవాహనాన్ని అధిరోహించిన స్వామివారు తిరుమాడవీధుల్లో ఊరేగుతూ భక్తులకు అభయ ప్రదానం చేశారు. పాలు, నీళ్లను వేరు చేసిన హంస తరహాలోనే... మానవునిలో దాగి ఉన్న అజ్ఞానాంధకారాన్ని తరిమి కొడుతూ జ్ఞానాన్ని ప్రబోధించే దిశగా స్వామివారు హంసవాహనంపై ఊరేగుతారని పండితుల వ్యాఖ్య. తొమ్మిదిరోజుల పాటు వైభవోపేతంగా జరిగే వాహనసేవల్లో హంస వాహనసేవ అపారమైందని శాస్త్రోక్తం.

దీనికిపూర్వం విశేష తిరువాభరణాలతో అలంకృతులైన శ్రీవారిని ఊరేగింపుగా ఊంజల్ మండపం వద్దకు చేర్చి ఊంజల్ సేవను కన్నుల పండుగగా జరిపారు. అనంతరం ఊంజల్ మండపం నుంచి వాహన మండపం వద్దకు చేర్చి సమర్పణ పూర్తయిన వెంటనే స్వామి వారిని హంస వాహన ఊరేగింపుకు సిద్ధం చేశారు.

వెబ్దునియా పై చదవండి