వెంకన్న బ్రహ్మోత్సవాలకు రంగం సిద్ధం!

బుధవారం, 1 అక్టోబరు 2008 (18:42 IST)
తిరుమల వెంకన్న వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని సర్వం సిద్ధమైంది. బ్రహ్మోత్సవాల కోసం భారీ ఏర్పాట్లు పూర్తికావస్తున్నాయి. ఉత్సవాల సందర్భంగా తిరుమలకు తరలివచ్చే లక్షలాది మంది భక్తుల సౌకర్యార్థం సకల సదుపాయాలతో పాటు దర్శన ఏర్పాట్లు కల్పించడంపై టీటీడీ కసరత్తు చేస్తోంది.

కొండపై కాటేజీలు, అతిథి భవనాలను ఉత్సవాల కోసం వచ్చే భక్తుల కోసం సిద్ధం చేస్తున్నారు. బ్రహ్మోత్సవాల ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్న విద్యుద్దీపాలంకరణ పనులను సంబంధిత సిబ్బంది యుద్ధ ప్రతిపాదికన చేపడుతున్నారు.

తిరుమలలోని ప్రధాన వీధులు, శ్రీవారి ఆలయ ప్రాకారాలు, ఇతర ముఖ్య కూడళ్లను భారీ విద్యుత్ దీపాల కటౌట్లతో అందంగా అలంకరించారు. దేశం నలుమూలల నుంచి అశేష సంఖ్యలో భక్తులు తరలివస్తుండటంతో నిఘా వర్గాలు ప్రత్యేక భద్రతా చర్యలు చేపట్టారు.

మరోవైపు... బ్రహ్మోత్సవాల్లో తొక్కిసలాట వంటి సంఘటనలు చోటు చేసుకోకుండా బాక్సుల తరహాలో బారికేడ్లను ఏర్పాటు చేశారు. రద్దీని ఎక్కడికక్కడ నియంత్రంచడానికి ప్రత్యేక గేట్లను ఏర్పాటు చేశారు. భద్రతా చర్యల్లో భాగంగా సుమారు 45 సర్క్యూట్ కెమెరాలను ఏర్పాటు చేశారు. తిరుమలేశుని ఆలయ వీధులను రంగ వల్లులతో ప్రత్యేకంగా తీర్చిదిద్దారు.

వెబ్దునియా పై చదవండి