కరోనా వైరస్ ప్రపంచాన్ని ఆందోళనకు గురిచేస్తోంది. ఈ వైరస్ బారినపడిన వారి సంఖ్య ఇప్పటికే వేలల్లో దాటిపోయింది. గురువారానికి ఏకంగా 7700 మందికి ఈ వైరస్ సోకినట్టు తేలింది. మరోవైపు, ఈ వైరస్ పుట్టుక కేంద్రంగా ఉన్న చైనాలో వైరస్ బారినపడి ఇప్పటివరకు 170 మంది చనిపోగా, మరికొందరు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
ఇదిలావుండగా, కరోనా వ్యాప్తితో కలకలం రేగడంతో చైనా నుంచి తమ దేశీయులను వెనక్కి రప్పించేందుకు భారత్ సహా పలు దేశాలు చర్యలు చేపట్టాయి. బ్రిటిష్ ఎయిర్‌వేస్ సహా పలు ఎయిర్‌లైన్‌లు చైనా నుంచి విమాన రాకపోకలను రద్దుచేశాయి. కరోనా వైరస్ బయటపడిన వుహన్ నగరం నుంచి తమ పౌరులను ఆయా దేశాలు వెనక్కిరప్పిస్తున్నాయి. వుహన్ నగరం నుంచి భారత పౌరులను వెనక్కి రప్పించేందుకు చైనాలో భారత్ రాయబార కార్యాలయం సన్నాహాలు చేపట్టింది.
అమెరికా, జపాన్, బ్రిటన్‌లు ఇప్పటికే తమ పౌరులను స్వదేశాలకు తరలించేందుకు ప్రత్యేక విమానాలను పంపగా, యూరప్, జర్మనీ, మంగోలియా, దక్షిణ కొరియా, న్యూజిలాండ్, ఆస్ర్టేలియాలూ విమానాలను పంపుతున్నాయి. కరోనా వైరస్ వ్యాప్తి పట్ల అన్ని దేశాలు అప్రమత్తంగా ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ విజ్ఞప్తి చేసింది.
మరోవైపు భారత్‌లోనూ కేరళ, గుజరాత్, ఢిల్లీలోనూ పలు కేసులను గుర్తించినా ఏ ఒక్క కేసూ పాజిటివ్‌గా నమోదు కాలేదు. అనుమానిత రోగుల శాంపిల్స్‌ను పుణేలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి పంపారు. కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు ఎయిర్‌పోర్ట్స్, ఆస్పత్రుల్లో ఏర్పాట్లను వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులు సమీక్షించారు.
ఇంకోవైపు, భారత్‌లో తొలి కేసు నమోదైంది. చైనాలోని వూవన్ విశ్వవిద్యాలయంలో చదువుతూ వచ్చిన కేరళకు చెందిన విద్యార్థికి ఈ వైరస్ సోకినట్టు కేంద్రం అధికారికంగా ప్రకటించింది. అయితే, ప్రస్తుతం ఈ విద్యార్థిని ఢిల్లీ ఆస్పత్రిలోని ఐసోలేటెడ్ వార్డులో ఉంచి చికిత్స అందిస్తూ, నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.