'నేను మాదిగ, మాలల కులంలో పుట్టాలా అనేది నా చాయిస్ కాదు. నేను పుట్టాను. ఈ పుట్టుకను ప్రకృతి ఇచ్చింది. ఏ కులంలో పుట్టినా మనం మానవజాతికి ఏమి చేస్తాం అనేదే ముఖ్యం' అని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు.
జనసేన పోరాట యాత్రలో భాగంగా ఆయన మాట్లాడుతూ, తాను ఒక్క కులానికి కాపు కాయబోనని, అన్ని కులాల వారికి రక్షణగా నిలబడతానని చెప్పారు. రాష్ట్రంలో కులాల కుంపటి రాజేస్తే అభివృద్ధికి విఘాతం కలుగుతుందన్నారు. తాను కులాల మధ్య ఐక్యత కోరుకుంటున్నట్టు చెప్పారు. ఇద్దరు వ్యక్తుల మధ్య సంవాదం జరిగినప్పుడు కులం ప్రస్తావన అనేది రాదన్నారు. రాష్ట్రంలోని రాజకీయ నేతలు మాత్రం ఓట్ల కోసం కులాల ప్రస్తావ తెస్తున్నారని ఆయన ఆరోపించారు.
'నాకు అల్లూరి సీతారామరాజు కులం తెలియదు. అసలు అంబేడ్కర్‌ను ఒక కులం వెనుక ఎందుకు పెట్టాలి. అల్లూరి సీతారామరాజుకు కులం ఏమిటి? ఆయన విప్లవ జ్యోతి. నా గుండెల్లో అది మండుతూనే, వెలుగుతూనే ఉంటుంది' అని వ్యాఖ్యానించారు.
ఇకపోతే, తమ పార్టీ గుర్తు పిడికిలి అని ప్రకటించారు. 'పిడికిలి ఐక్యతకు, పోరాటానికి చిహ్నం. జనసేన పార్టీ గుర్తు అదే-పిడికిలి' అని నినదించారు. కులాలు, మతాలు, ప్రాంతాలకు, అందరికీ ఇది నిదర్శనమని తెలిపారు. ఐక్యతతో ఉన్న సమాజానికి పిడికిలి నిదర్శనమని గుర్తుచేశారు.