కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యడ్యూరప్ప పదవి మూణ్ణాళ్ళ ముచ్చటగా మారింది. ఈనెల 17వ తేదీన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఆయన... తన పదవిని కాపాడుకునేందుకు సర్వవిధాలా ప్రయత్నించారు. అయతే, ఆ ప్రయత్నాలేవీ ఫలించక పోవడంతో మరో మార్గం లేక ఆయన తన పదవికి రాజీనామా చేస్తున్నట్టు అసెంబ్లీ వేదికగా ప్రకటించారు. దీంతో యడ్యూరప్ప పదవి మూణ్ణాళ్ల ముచ్చటగా మారింది.
అంతకుముందు ఆయన విశ్వాస తీర్మానం ప్రవేశపెట్టి మాట్లాడుతూ, ఇటీవల జరిగిన ఎన్నికల్లో కన్నడ ప్రజలు కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలను ఛీకొట్టారనీ, కానీ అధికారం కోసం ఆ రెండు పార్టీలు వెంపర్లాడుతున్నాయంటూ ఆరోపించారు. ఎన్నికలకు ముందే ప్రధాని మోడీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాలు తనను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించారని ఈ సందర్భంగా యడ్యూరప్ప గుర్తు చేశారు.
బీజేపీకి కర్ణాటక ఓటర్లు పట్టం కట్టారని... బీజేపీని అతిపెద్ద పార్టీగా ఎన్నుకున్నారని చెప్పారు. కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలను ప్రజలు ఓడించారని చెప్పారు. గత రెండేళ్లగా తాను కర్ణాటక వ్యాప్తంగా పర్యటించానని చెప్పారు. కాంగ్రెస్, జేడీఎస్ లు అవకాశవాద రాజకీయాలకు పాల్పడుతున్నాయని విమర్శించారు. ప్రజలు తీరస్కరించినా ప్రభుత్వ ఏర్పాటుకు ఆ రెండు పార్టీలు ప్రయత్నించడం బాధాకరమని చెప్పి, ఆయన తన పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు.