లాక్‌డౌన్‌లో తట్టిన ఐడియా... నాలుగు సీట్ల విమానం రెడీ.. ఖర్చు రూ.1.8 కోట్లు..
బుధవారం, 27 జులై 2022 (13:13 IST)
కేరళలోని అలప్పుళ ప్రాంతానికి చెందిన అశోక్ అలిసెరిల్ తామరక్షన్ ఓ మెకానికల్ ఇంజినీర్. ఈయన మాజీ ఎమ్మెల్యే వి.తామరక్షన్ కుమారుడు. ప్రస్తుతం అశోక్ అరుదైన ఘనతను సాధించాడు.
పాలక్కాడ్‌లోని ఇంజినీరింగ్ కాలేజీ నుంచి బీటెక్ పట్టా పుచ్చుకున్న అనంతరం మెకానికల్ ఇంజినీరింగ్‌లో మాస్టర్స్ డిగ్రీ కోసం 2006లో బ్రిటన్ వెళ్లిపోయాడు. ఆపై పెళ్లి చేసుకుని ఫోర్డ్ మోటార్ కంపెనీలో మంచి ఉద్యోగంతో లండన్‌లో స్థిరపడ్డాడు. 2018లో పైలెట్ లైసెన్స్ కూడా పొందాడు.
కరోనా సంక్షోభానికి ముందు అశోక్ 2 సీట్ల చిన్న విమానాన్ని అద్దెకు తీసుకుని సరదాగా విహరించేవాడు. ప్రస్తుతం లాక్ డౌన్ సమయంలో 4 సీట్ల విమానం తయారు చేశారు. ఈ విమానంలో తనతో పాటు భార్య, ఇద్దరు కుమార్తెలను తీసుకుని యూకే చుట్టి వచ్చారు.
బ్రిటన్‌లోని ప్రదేశాలనే కాదు, స్నేహితులతో కలిసి జర్మనీ, ఆస్ట్రియా, చెక్ రిపబ్లిక్ దేశాలను కూడా తన చిన్నవిమానంలో చుట్టొచ్చాడు.
దాంతో కరోనా లాక్ డౌన్ సమయంలో 4 సీట్ల విమానం తయారీ ఆలోచన వచ్చింది. సాధారణంగా సింగిల్ సీటర్, డబుల్ సీటర్ విమానాలు ఎక్కువగా లభ్యమవుతాయి కానీ, 4 సీట్ల విమానాలు చాలా అరుదు అని అశోక్ అభిప్రాయపడ్డాడు.
ఇక దక్షిణాఫ్రికాలోని జోహాన్నెస్ బర్గ్ కు చెందిన స్లింగ్ ఎయిర్ క్రాఫ్ట్ అనే కంపెనీ స్లింగ్ టీఎస్ఐ పేరిట విమాన తయారీ కిట్‌ను విక్రయిస్తోందని.. ఆర్డర్ చేశారు. లండన్‌లోని తన నివాసంలో ఓ వర్క్ షాపు ఏర్పాటు చేసుకుని విమాన తయారీ ప్రారంభించాడు. అశోక్ విమానం తయారు చేస్తుండగా, బ్రిటన్ పౌర విమానయాన శాఖ అధికారులు పలుమార్లు సాధారణ తనిఖీ చేశారు.
ఇటీవలే ఫిబ్రవరిలో తన చేతులమీదుగా రూపుదిద్దుకున్న ఈ నాలుగు సీట్ల విమానంలో అశోక్ గగనవిహారం చేసి మురిసిపోయాడు. ఈ విమానం తయారీకి అతడికైన ఖర్చు రూ.1.8 కోట్లు.
ఇది గంటకు 200 కిలోమీటర్ల వేగంతో పయనిస్తుంది. ఇదే వేగంతో పయనిస్తే గంటకు 20 లీటర్ల ఇంధనం ఖర్చవుతుంది. ఈ విమానంలో ఇంధన ట్యాంకు సామర్థ్యం 180 లీటర్లు.
కాగా, ఈ విమానంలో అశోక్ తన కుటుంబంతో కలిసి బ్రిటన్ వ్యాప్తంగా అనేక పర్యాటక స్థలాలను సందర్శించాడు. ఈ విమానం తయారీకి అతడికి 18 నెలలు పట్టింది. తన కుమార్తె పేరిట జి-దియా అని ఆ ప్లేన్ కు నామకరణం చేశాడు.
యూరప్ దేశాలు, అమెరికా తదితర దేశాల్లో ఇలా ఇంట్లోనే తయారుచేసుకునే విమానాలకు అనుమతి ఉంటుంది. భారత్‌లో కూడా ఇలాగే అనుమతులు లభిస్తే బాగుంటుందని అశోక్ ఆశాభావం వ్యక్తం చేశాడు. ప్రస్తుతం అశోక్ తన భార్య అభిలాష, కుమార్తెలు తార, దియాలతో కలిసి స్వస్థలం అలప్పుళ వచ్చారు.