నెల్లూరు మంత్రి అనిల్ కుమార్ ఒంటరి పోరాటం?

మంగళవారం, 3 ఆగస్టు 2021 (16:20 IST)
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు, మాజీ మంత్రి నారా లోకేష్‌లపై ఒంటి కాలుపై లేచే మంత్రి ఒకరు జిల్లాలో ఒంటరిగా మిగిలిపోయారని ప్రచారం జరుగుతోంది. ఆయ‌న స‌హ మంత్రి, అధికార ఎమ్మెల్యేలు కూడా దూరంగా ఉంటున్నారని… నోటి దురుసుతనం, సిఎం జగన్‌ అండదండలు, ఆశీస్సులున్నాయనే గుడ్డి నమ్మకమే ఆ మంత్రిని ఒంటరిని చేశాయంటున్నారు అధికార పార్టీ నేతలు.
 
ఆయ‌న ఎవ‌రో కాదు... ఏపీ నీటిపారుద‌ల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాద‌వ్. నెల్లూరు జిల్లాలో అధికార పార్టీ నేత‌లు ఒక్కొక్క‌రూ ఆయ‌న‌కు దూరం అవుతున్నార‌ని చెపుతున్నారు. జ‌గ‌న్ ప్ర‌బుత్వంలో కీల‌క శాఖ పొంది, దూకుడుగా ముందుకు వెళ్లిన అనిల్‌కు ఇపుడు బ్రేకులు ప‌డుతున్నాయ‌ని చెపుతున్నారు.

తను ఐదేళ్లు మంత్రిగా కొనసాగటం ఖాయమని, సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి త‌న‌కు పూర్తి అండ‌దండ‌గా ఉన్నార‌ని గ‌తంలో మంత్రి అనిల్ కుమార్ త‌న స‌న్నిహితుల‌తో చెప్పేవార‌ట‌. అదే ధీమాతో ఆయ‌న పది మందికి పదేపదే చెబుతున్నా, చివరకు రెండున్నరేళ్ల మంత్రిగానే మిగిలిపోయే పరిస్థితి ఎదుర‌వుతుంద‌ని పార్టీ వ‌ర్గాలు గుస‌గుస‌లాడుతున్నాయి. 
 
అసలు విషయానికి వస్తే.. మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్ యూత్ ఫోర్స్‌తో గతంలో చేసిన హడావిడి, దూకుడుతనానికి, ముఖ్యంగా నోటి దురుసుత‌నానికి అంతా దూరం అవుతున్నార‌ని సొంత పార్టీ వారే ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. ఇదే వ్య‌వ‌హార శైలితో ఇత‌ర ఎమ్మెల్యేల‌తో పాటు ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి కూడా ఆయనకు దూరం అయ్యారని అధికార పార్టీ నేతలే అంటున్నారు.
 
ఇటీవల ఆయనను సీఎం జగన్‌ కూడా దూరం పెడుతున్నార‌ని, ఆయన వ్యవహారశైలిపై ఆగ్రహంగా ఉన్నారని అధికార ప్రజాప్రతినిధులే తెర వెనుక అంటున్నారు. మంత్రిపై అవినీతి ఆరోపణలతో పాటు దూకుడుతనం, నిర్లక్ష్యం, ఎవరినీ ఖాతరు చేయని మనస్తత్వంతో మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్‌ చేజేతులారా సమస్యలను కొని తెచ్చుకుంటున్నారని ఆయ‌న స‌న్నిహితులు వాపోతున్నారు.
 
తొలి రెండున్న‌రేళ్ల వరకే ఆయన మంత్రి పదవిలో కొనసాగుతారని, నెల్లూరు జిల్లా మెజార్టీ అధికార పార్టీ నేతలతో పాటు ప్రజాప్రతినిధులు తమ సన్నిహితులతో చెబుతున్నారని బయటకు పొక్కింది. గతంలో మంత్రి అనిల్‌తో కలిసి ఉన్న అధికార ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డి కూడా ఆయనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారట. అటు మంత్రి అనిల్‌ ఇటు కోటంరెడ్డి మధ్య ఏ విషయంలో విభేదాలు ఏర్పడ్డాయి? ఏ కారణాలతో వారి మధ్య విభేదం పెరిగిందన్న విషయంపై,  రకరకాలుగా ప్రచారం జరుగుతోంది. దీంతో కోటం రెడ్డి కూడా అనిల్‌ వ్యతిరేకవర్గంలో చేరిపోవటంతో అనిల్‌ ఒంటరిగా మిగిలిపోయార‌ని అంటున్నారు.

ఇటీవ‌ల పోల‌వ‌రం ప‌ర్య‌ట‌న స‌మ‌యంలోనూ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి మంత్రి అనిల్ కుమార్‌కు  పెద్ద‌గా ప్రాధాన్యం ఇవ్వ‌లేద‌ని, దీనినిబ‌ట్టి ఆయ‌న కొన‌సాగింపు అనుమాన‌మే అని అంటున్నారు. అయితే, ఈ గ్యాప్‌ని అనిల్ ఏవిధంగా పూడ్చుకుని, మంత్రిగా కొన‌సాగే ప్ర‌య‌త్నం చేస్తారో వేచి చూడాలి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు