రాజధానిగా విశాఖపట్టణమా?! .. వద్దనే వద్దంటున్న సీమ వాసులు

సోమవారం, 30 డిశెంబరు 2019 (16:10 IST)
నవ్యాంధ్ర రాజధానిని విశాఖపట్టణానికి తరలించాలని ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి నిర్ణయించారు. దీంతో విశాఖ వాసులు సంబరాలు చేసుకుంటున్నారు. అమరావతి ప్రాంత వాసులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కానీ, రాయలసీమ ప్రాంత వాసులు మాత్రం గగ్గోలు పెడుతున్నారు. దీనికి కారణం విశాఖకు వెళ్లాలంటే వెయ్యి కిలోమీటర్ల దూరం ప్రయాణం చేయాల్సి రావడమే. 
 
సాధారణంగా, రాయలసీమ ప్రాంత జిల్లాలకు సొంతరాష్ట్ర రాజధాని కంటే పొరుగు రాష్ట్రాల రాజధానులు చాలా తక్కువ దూరంలో ఉన్నాయి. ఉదయం బయలుదేరి సాయంత్రానికి ఇంటికి చేరుకోవచ్చు. కానీ, విశాఖ అంటే ఎటు నుంచి చూసిన దాదాపు వెయ్యి కిలోమీటర్లు ప్రయాణం చేయాలి. ఇదే వారిని భయపెడుతోంది. కడుపులో నీళ్లు కదలకుండా అమరావతికి వచ్చి పోయే రాయలసీమ ప్రజలు విశాఖ రాజధాని అనగానే గగ్గోలు పెట్టడానికి ప్రధాన కారణం ఇదే. 
 
బాబోయ్‌.. రాజధానిగా ఆ నగరం మాకొద్దే వద్దని అంటున్నారు. భౌగోళికంగా సుదూర ప్రాంతం కావడంతో సీమ ప్రజలు విశాఖను రాజధానిగా అంగీకరించడానికి సుముఖంగా లేరు. దీని కంటే దక్షిణాది రాష్ట్రాలైన తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ, పుదుచ్చేరి రాజధానులు తమకు దగ్గరగా ఉన్నాయని అంటున్నారు. చివరకు గోవాకైనా విశాఖ కంటే వేగంగా చేరుకోవచ్చని చెబుతున్నారు.
 
ప్రస్తుతం రాయలసీమలోని నాలుగు జిల్లాల కేంద్రాల నుంచి విశాఖ చేరుకోవాలంటే సగటున 900 కిలోమీటర్లు ప్రయాణం చేయాలి. సీఎం జగన్‌ సొంత జిల్లా కడప ప్రజలు 14 గంటల పాటు బస్సులో ప్రయాణం చేస్తే తప్ప ఆ నగరానికి చేరుకోలేరు. కడప నగరం నుంచి విశాఖకు 732 కి.మీ. దూరం ఉంది. అనంతపురం విశాఖకు చేరుకోవాలంటే మూడు చెరువుల నీళ్లు తాగాల్సిందే. 890 కి..మీ. ప్రయాణం చేయాల్సి ఉంటుంది. 17 గంటల పాటు బస్సులో ప్రయాణిస్తే తప్ప చేరుకోలేరు. 
 
ఇదే జిల్లా రాయదుర్గం నుంచి విశాఖకు 977 కి.మీ. అంటే మరో రెండు గంటలు అదనపు ప్రయాణమన్న మాట. ఇక చిత్తూరు ప్రజల పరిస్థితి కూడా ఇలానే ఉంది. చిత్తూరు నగరం నుంచి విశాఖకు వెళ్లాలంటే 832 కి.మీ. 15 గంటల పాటు బస్సు ప్రయాణం చేయాలి. అదే టీడీపీ అధినేత చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నుంచైతే విశాఖకు 950 కి.మీ. దూరం. కర్నూలు ప్రజలు విశాఖ చేరుకోవాలంటే సుమారు 700 కి.మీ. దూరం ఉంది.
 
ఇలా ఆ నాలుగు జిల్లాల ప్రజలు రాజధానికి వచ్చి వెళ్లడానికే సుమారు రెండ్రోజుల సమయం కేటాయించాలి. విశాఖ కంటే వారు హైదరాబాద్‌, చెన్నై, బెంగళూరుకు తక్కువ సమయంలో వెళ్లి రావచ్చన్నది వారి భావనగా ఉంది. 
 
అమరావతే దగ్గర.. 
రాయలసీమ ప్రజలు రాజధానిగా విశాఖ కంటే అమరావతే మేలు అని భావిస్తున్నారు. ఆ నాలుగు జిల్లాల ప్రజలు రాత్రికి బస్సు ఎక్కితే ఉదయానికల్లా అమరావతికి చేరుకోవచ్చు. ఒక్క అనంతపురం మినహా మిగిలిన మూడు జిల్లాల ప్రజలు కేవలం ఏడు గంటల్లో అమరావతికి రావచ్చు. అనంతపురం నుంచి కూడా 9 గంటల్లో అమరావతికి చేరుకోవచ్చు. ఆ నాలుగు జిల్లాలకు అమరావతి 450 కి.మీ. లోపే ఉంది. అనంతపురం నుంచి అమరావతికి 438 కి.మీ దూరం. కేవలం 9 గంటల్లో రావచ్చు. కడప నుంచి కూడా 6 గంటల్లో 348 కిలోమీటర్లు ప్రయాణం చేస్తే చేరుకోవచ్చు. చిత్తూరు ప్రజలు 447 కి.మీ ప్రయాణం చేయాల్సి ఉంటుంది. అత్యల్పంగా కర్నూలు ప్రజలు 297 కి.మీ. ప్రయాణం చేస్తే అమరావతికి సులువుగా చేరుకునే అవకాశం ఉంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు