బహిష్టు అయిన మహిళా పెట్టుకున్న నాప్‌కిన్‌ను కూడా తొలగించి తనిఖీ.. ఎక్కడ?

ఆదివారం, 1 ఏప్రియల్ 2018 (15:57 IST)
ప్రైవేట్ విమానయాన సంస్థలకు చెందిన సిబ్బంది అతి చేష్టలు ఇటీవలి కాలంలో శృతిమించిపోయాయి. ముఖ్యంగా, భద్రత పేరుతో మహిళలను బట్టలిప్పి మరీ తనిఖీ చేస్తున్నారు. తాజాగా బహిష్టు అయిన మహిళా పెట్టుకున్న నాప్‌కిప్‌ను కూడా ఆ విమానయాన సంస్థ సిబ్బంది తొలగించి తనిఖీ చేయడం ఇపుడు వివాదాస్పదమైంది. 
 
ఇదంతా ఇదెక్కడో మారుమూల ప్రాంతంలోనో.. నాగరికతకు దూరంగా ఉన్న అడవుల్లోనో జరిగిన ఘటన అనుకుంటే పొరపాటే. సభ్యసమాజం తలవంచుకునేలా చేసిన ఈ చర్యకు ఒడిగట్టింది స్పైస్‌జెట్‌ విమానయాన సంస్థ సెక్యూరిటీ సిబ్బంది. తనిఖీలు చేసింది ఎయిర్‌ హోస్టెస్‌, ఇతర విమాన సిబ్బందిని. 
 
స్పైస్‌జెట్‌ ఎయిర్‌ హోస్టెస్‌లు విమానాల్లో తినుబండారాలు, శీతల పానీయాలను విక్రయించే సమయంలో చేతివాటాన్ని ప్రదర్శిస్తున్నారని, విమానంలోని పలు వస్తువులను మూడో కంటికి తెలియకుండా చోరీ చేస్తున్నారని ఆ సంస్థ కొంతకాలంగా అనుమానిస్తోంది. దీంతో మార్చి 28వ తేదీన అర్థరాత్రి నుంచి ఆ సంస్థ సెక్యూరిటీ అధికారులు.. సిబ్బందికి శల్యపరీక్షలు ప్రారంభించారు. 
 
శనివారం ఉదయం తనకు జరిగిన అవమానాన్ని చెన్నైకి చెందిన ఓ ఎయిర్‌ హోస్టెస్‌ మీడియాకు చెప్పడంతో విషయం వెలుగులోకి వచ్చింది. 'డబ్బులు దొంగిలించావా? అంటూ సెక్యూరిటీ సిబ్బంది తనిఖీలు ప్రారంభించారు. మహిళా సెక్యూరిటీ సిబ్బందే ఉన్నా.. ఒంటిని తడుముతూ తనిఖీ చేయడం ఇబ్బందిగా ఉంది. 
 
అంతలోనే బట్టలిప్పాలంటూ హుకుం జారీ చేశారు. నగ్నంగా నిలబెట్టి తనిఖీలు చేశారు. నాతో పనిచేసే మరో ఎయిర్‌ హోస్టెస్‌కి పీరియడ్స్‌. తను ధరించిన శానిటరీ నాప్‌కిన్‌ను కూడా తొలగించి, పరిశీలించారు' అంటూ బోరున విలపిస్తూ వాపోయింది. ఈ చర్యను స్పైస్ జెట్ అధికారులు సమర్థించుకున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు