తమిళనాడు రాష్ట్రంలో మానవత్వానికే మచ్చ తెచ్చే సంఘటన ఒకటి జరిగింది. చనిపోయిన ఓ దళితుడి మృతదేహాన్ని తమ ఇళ్లు, పంట పొలాల్లో తీసుకెళ్లడానికి వీల్లేదంటూ అగ్రవర్ణాలకు చెందిన ప్రజలు హుకుం జారీ చేశారు. దీంతో ఆ దళితుడి మృతదేహాన్ని వంతెనపై నుంచి జారవిడిచి శ్మశానవాటికకు తరలించి ఖననం చేశారు. ఈ విచారకర సంఘటన రాష్ట్రంలోని వెల్లూరు జిల్లాలో జరిగింది.
ఈ వివరాలను పరిశీలిస్తే, వెల్లూరు జిల్లా వాణియంబాడికి చెందిన ఎన్.కుప్పమ్ (46) అనే వ్యక్తి శనివారం ప్రాణాలు కోల్పోయాడు. అయితే మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించడానికి తమ పొలం నుంచి శవాన్ని తీసుకెళ్లేందుకు అగ్రవర్ణాల వారు అంగీకరించలేదు. పైగా, పురాతనమైన ఆది ద్రావిడర్ శ్మశాన వాటికకు ఈ పంట పొలాల నుంచే వెళ్లాల్సి ఉంటుంది.
అయితే, ఆ పొలాల మీదుగా శవాన్ని తీసుకెళ్లడానికి పొలాల యజమానులు సమ్మతించలేదు. దీంతో వంతెన కింద నుంచి మృతదేహాన్ని తరలించారు. ఇందుకోసం కుటుంబసభ్యులు ఆ మృతదేహాన్ని 20 అడుగుల ఎత్తు నుంచి వంతెన కిందకు తాళ్ల సాయంతో జారవిడిచారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఈ ఘటనపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.