గత కొన్నేళ్లుగా గోదావరి జిల్లా నుంచి ఖైరతాబాద్ వినాయకుడికి భారీ లడ్డూలు వచ్చేవి. ఇప్పుడు పరిస్థితి మారింది. రాష్ట్రంలో నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల వల్ల తెలంగాణ, సమైక్యాంధ్ర అంటూ రెండు వేర్వేరు గొడవలు జరుగుతున్నాయి. సమైక్యాంధ్ర గళం విపరీతంగా విన్పిస్తున్న తూర్పుగోదావరి జిల్లా తాపేశ్వరం నుంచి వినాయకుడికి లడ్డూ వచ్చేది.
ఖైరతాబాద్‌తోపాటు చాలాచోట్ల నుంచి అక్కడికే ఆర్డర్లు వెళ్లేవి. కానీ ఈసారి ఎవ్వరి ఆర్డర్లు తీసుకోలేదు నిర్వాహకులు. కేవలం చివరిసారిగా అంటూ ఖైరతాబాద్ వినాయకుడికి లడ్డూ ఇవ్వన్నుట్లు తెలియజేశారు. ఇక్కడి లడ్డూ 2001లో 5,570 కిలోల బరువుతో గిన్నిస్‌బుక్ ఎక్కింది. రెండోసారి 6 వేల కేజీలతో ఎక్కింది.
ఈసారి దాన్ని ఏడు వేల కేజీలగా మార్చి హ్యాట్రిక్ కోసం ప్రయత్నిస్తున్నారు. భక్తిభావంతోపాటు తెలుగువారంతా సమక్యంగా ఉండాలని తాము చేసినట్లు నిర్వాహకుల్లో ఒకరైన శ్రీనివాస్ తెలియజేస్తున్నారు.
ఈ లడ్డూ తయారీకి 1600 మందికార్మికలు రాత్రింబవళ్లూ పనిచేస్తున్నారు. శనగపిండితోపాటు 2వేల కేజీల పంచదార, 500 కి.గ్రా బెల్లం, జీడిపప్పు, 40 కేజీల యాలకులు, కుంకుమపువ్వు, పచ్చకర్పూరం వంటి వాటితో ఈ లడ్డూ తయారవుతుంది. ప్రత్యేక క్రేన్ సాయంతో ఈ లడ్డూను తరలించి వినాయకుడి చేతిలో పెట్టనున్నారు. ఈ లడ్డూ నెలరోజుల పాటు చెడిపోకుండా ఉంటుందని నిర్వాహకులు చెబుతున్నారు.