సాధారణంగా కొంతమంది స్త్రీలు బహిష్టు సమయంలో కడుపునొప్పితో తీవ్రంగా బాధపడుతుంటారు. ఈ సమస్య నుండి ఎలా బయటపడాలి దేవుడా అంటూ మొరపెడుతుంటారు. కానీ, పెద్దలేమంటున్నారంటే.. స్త్రీలకు ఈ సమస్య ఓ పెద్ద విషయమేం కాదని చెప్తున్నారు. మరి వైద్యులేమో దీనిని ఇలానే వదిలేస్తే నొప్పి శరీరం మొత్తం పాకుతుందని అంటారు..
దాదాపు మహిళలు అందరూ అప్పుడప్పుడూ పొత్తి కడుపులో నొప్పితో బాధపడుతుంటారు. ఆ సమయంలో ఏ కారణంగా ఆ నొప్పి వచ్చిందో సరిగ్గా తెలుసుకోలేరు. అటువంటి సమయాల్లో ఈ రకమైన నొప్పులు మహిళలకు సాధారణమైనవేనని, వాటికి అలవాటు పడాల్సిందేనని కొందరు పెద్దలు సలహాలు కూడా ఇస్తుంటారు.
అయితే అటువంటి సమయంలో ఒక్కోప్పుడు నిలబడటం కానీ, కూర్చోవడం కానీ, మాట్లాడటం కానీ చేయలేని పరిస్థితి ఏర్పడుతుంది. సరైన సమయంలో చికిత్స తీసుకోకుంటే చివరకు అది కొన్నిసార్లు ప్రమాదకరంగా మారుతుంది.
సాధారణంగా మహిళలకు బొడ్డు కింది భాగంలో వచ్చే ఈ నొప్పి కొన్ని సందర్భాల్లో బొడ్డు పైభాగానికి కూడా పాకుతుంది. పొత్తి కడుపులో సమస్య వలన వీపు కింది భాగంలో కూడా తీవ్ర నొప్పి పుడుతుంది. ఇలాంటి నొప్పులు వచ్చిన సమయంలో ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా వెంటనే ఓ డాక్టర్‌ను సంప్రదించడం చాలా అవసరం. లేదంటే సమస్య మరింత ఎక్కువగా మారుతుంది.