అధిక బరువుకు కారణమయ్యే ఉదయపు అలవాట్లు ఏంటి?

మంగళవారం, 21 ఫిబ్రవరి 2023 (12:44 IST)
చాలా మంది అధిక బరువు సమస్యతో బాధపడుతుంటారు. ఈ సమస్య నుంచి బయటపడేందుకు పడరాని పాట్లు పడుతుంటారు. అయితే, మన అలవాట్లు కూడా అధిక బరువుకు ఓ కారణంగా నిలుస్తుంటాయి. మరీముఖ్యంగా, ఉదయపు అలవాట్లు కూడా అధిక బరువుకు కారణమవుతుంటాయి. అవేంటో ఓసారి తెలుసుకుందాం. 
 
చాలా మంది అతిగా నిద్రపోతుంటారు. మరికొందరు నిద్రపోరు. అంటే నిద్ర తగ్గినా బరువు పెరుగుతారు. అయితే నిద్ర పెరిగినా ఇదే ఫలితం దక్కుతుంది. రోజుకు పది గంటలు నిద్రపోయే వ్యక్తుల్లో బిఎమ్ పెరిగిపోయే అవకాశాలున్నాయని పరిశోధనల్లో తేలింది. కాబట్టి వీలైనంత త్వరగా నిద్రకు ఉపక్రమించి, వీలైనంత త్వరగా నిద్ర లేవాలి.
 
రోజులో అత్యంత ముఖ్యమైన ఆహారం అల్పాహారం. దీన్ని ఎటువంటి పరిస్థితుల్లోనూ మానేయకూడదు. ఉదయాన్ని ఉపవాసంతో మొదలుపెట్టి, మధ్యాహ్నం అవసరానికి మించిన ఆకలితో ఎక్కువ ఆహారం తినడం అనారోగ్యకరం. ఈ అలవాటు అధిక బరువుకు దారి తీస్తుంది. కాబట్టి తగినన్ని పిండిపదార్ధాలు, మాంసకృత్తులు, కొవ్వులు ఉండే బలవర్థకమైన అల్పాహారంలో తీసుకోవాలి. 
 
పడక గదిలోకి సహజసిద్ధమైన వెలుగు ప్రసరించేలా చూసుకోవాలి. కిటికీలు, కర్టెన్లు మూసి ఉంచి, సూర్యరశ్మి చొరబడకుండా చీకట్లో నిద్ర లేవడం వల్ల శరీరం బడలికను వదిలించుకోలేదు. ప్రకృతిసిద్ధమైన ప్రయోజనాలను అందుకోలేదు. శరీర జీవగడియారం క్రమ పద్ధతిలో నడుచుకోవాలంటే నిద్ర లేచిన వెంటనే శరీరానికి సూర్యరశ్మి సోకనివ్వాలి.
 
ఉదయం నిద్ర లేచిన వెంటనే దుప్పట్లు మడత పెట్టడం, దిండ్లు, పరుపును సర్దుకునే అలవాటు అలవరుచుకోవాలి. ఇలాంటి అలవాటు వల్ల రాత్రి పడక చేరిన వెంటనే నిద్ర ముంచుకొస్తుంది. నిద్రలేమి సమస్య తప్పుతుంది. అలాగే ఒక క్రమశిక్షణ అలవాటై వేళకు నిద్ర ఆవరిస్తుంది. ఉదయం కొత్త హుషారుతో మేలుకోగలుగుతాం.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు