పద్మాసనం

శనివారం, 8 మే 2010 (19:23 IST)
పద్మాసన భంగిమ తామరపువ్వును పోలి ఉంటుంది. పద్మాసనం అనేది సంస్కృత పదం నుంచి వచ్చింది. పద్మ అంటే తామరపువ్వు అని, ఆసనా అంటే భంగిమ లేక స్థితి అంటారు. ఆసనాలు ప్రారంభించే ముందుగా.. నేల మీద చాపను గాని మందపాటి కాస్తంత మెత్తటి వస్త్రాన్ని పరుచుకోవాలి.

చేయు పద్ధతి :
నేల మీద కూర్చుని రెండు కాళ్లను బార్లా ముందుకు చాపుకోవాలి. తర్వాత రెండు చేతులతో కుడికాలి పాదాన్ని పట్టుకుని మోకాలివరకు మడిచి ఎడమతొడపై ఉంచాలి. వీలైనంత వరకు కుడి మడమ భాగం నాభిని తాకేలా దగ్గరకు తీసుకోవాలి. ఆ తర్వాత ఎడమకాలి పాదాన్ని కూడా రెండు చేతులతో పట్టుకుని కుడికాలి తొడపై ఉంచాలి. దీన్ని కూడా వీలైనంత వరకు ఎడమమడమ భాగం నాభిని తాకేలా దగ్గరకు తీసుకోవాలి. ఈ స్థితిలో రెండు కాళ్లకు సంబంధించిన మోకాళ్లు తప్పని సరిగా నేలను తాకుతూ ఉండేలా చూసుకోవాలి. మరింత ఒత్తిడికి గురిచేయకుండా వెన్నెముకను నిటారుగా ఉంచాలి. కొంత సమయం పాటు అంటే సౌకర్యవంతంగా ఉండే వరకు అదే స్థితిలో కొనసాగాలి.
WD


వెన్నెముక నిటారుగా ఉంచాలి. రెండు చేతులను నమస్కార స్థితిలోను లేదా ఒకదానిపై మరొక చేతిని కలిపి ఉంచే స్థితి లేదా అరచేయి భాగం పైకి కనపడేలా రెండు అరచేతులను ఒకదానిపై ఒకటి ఉండే స్థితి లేదా మోకాళ్లపై రెండు చేతులను విశ్రాంతి స్థితిలో ఉంచాలనుకున్నప్పుడు.. రెండు అరచేతులు పైకి కనపడేలా లేదా రెండు అరచేతులు కిందకు చూచేలా ఉంచవచ్చు లేదా మోకాళ్లపై చేతులు ఉంచి బొటనవేలితో చూపుడు వేలును తాకించి మిగిలిన వేళ్లను అలాగే నిటారుగా ఉంచాలి.

ఉపయోగాలు :
మెదడుకు ప్రశాంతత.
శరీరం తేలికవుతుంది.
మోకాళ్లు, చీలమండలు విస్తరిస్తాయి.
దిగువ శరీరంలోని వెన్ను చివరిభాగం, వెన్నెముక భాగం, పొత్తికడుపు వంటి మొదలైన భాగాల్లో చైతన్యాన్ని కలిగిస్తుంది.

జాగ్రత్తలు :
చీలమండ గాయం అయ్యే అవకాశం.
మోకాళ్ల నొప్పులు వచ్చేందుకు ఆస్కారం.

వెబ్దునియా పై చదవండి