దేశంలో పెద్ద విలువ కలిగిన రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీసుకున్న నిర్ణయం ఈనెల ఎనిమిదో తేదీతో ఒక యేడాది పూర్తికానుంది. దీంతో నవంబర్ ఎనిమిదో తేదీన బ్లాక్ డేగా నిర్వహించాలని విపక్ష పార్టీలన్నీ ఓ నిర్ణయానికి వచ్చాయి. ఈ మేరకు కాంగ్రెస్ సారథ్యంలోని 18 విపక్ష పార్టీలు పిలుపునిచ్చాయి.
నోట్ల రద్దు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆరోజు దేశవ్యాప్త ఆందోళనలు చేపట్టనున్నట్లు విపక్షాలు ప్రకటించాయి. మోడీ ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయం వల్ల దేశవ్యాప్తంగా ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారని కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ గుర్తు చేశారు. నోట్లరద్దుతో నల్లధనం, ఉగ్రవాదం, ఫేక్ కరెన్సీ నిర్మూలిస్తామన్న మోడీ ఆకాంక్ష నెరవేరకపోగా... అది మరింత పెరిగిందని ఆయన ధ్వజమెత్తారు.
మరోవైపు... నవంబర్ 8వ తేదీన నల్లధనం వ్యతిరేకదినాన్ని నిర్వహించనున్నట్లు కేంద్రం ప్రకటించింది. నల్లధనాన్ని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా జరిగే ఈ కార్యక్రమంలో బీజేపీ నేతలు పాల్గొంటారని కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ వెల్లడించారు. నల్లధనానికి వ్యతిరేకంగా కేంద్రం తీసుకున్న చర్యలను ప్రజలకు వివరిస్తారన్నారు. నల్లధనం నిర్మూలనలో భాగంగానే పెద్దనోట్లను రద్దు చేసినట్లు జైట్లీ తమ చర్యను సమర్థించుకున్నారు.