భారత్‌కు వెన్నుపోటు... నమ్మించి గొంతుకోసిన ఆ రెండు దేశాలు... ఏ విషయంలో?

గురువారం, 27 ఏప్రియల్ 2017 (14:30 IST)
భారత్‌ను వెన్నుపోటు పొడిచారు. రెండు దేశాలు నమ్మించి గొంతుకోశాయి. ఫలితంగా అంతర్జాతీయ క్రికెట్ ప్రపంచంలో భారత్ ఏకాకి అయింది. దీంతో ప్రపంచ క్రికెట్‌ను తన కనుసన్నల్లో శాసించగలిగే అవకాశాన్ని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు కోల్పోయింది. 
 
ఐసీసీ పాలనా వ్యవస్థలో మార్పులతోపాటు భారత బోర్డు ఆదాయానికి భారీగా గండికొట్టే ఆదాయ పంపిణీ నమూనాలపై జరిగిన ఓటింగ్‌లో బీసీసీఐ చిత్తుగా ఓడింది. మద్దతుగా నిలుస్తాయనుకున్న జింబాబ్వే, బంగ్లాదేశ్‌లు నమ్మించి వంచించాయి. దీంతో ప్రపంచ క్రికెట్‌లో పెద్దన్నగా పెత్తనం చేసిన బీసీసీఐ.. ఇపుడు ఏకాకిగా మారింది.
 
ఐసీసీ రూపొందించిన సరికొత్త పాలనా వ్యవస్థ, ఆదాయ పంపిణీ నమూనాను భారత్ నియంత్ర మండలి (బీసీసీఐ) తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఇదే అంశంపై బుధవారం దుబాయ్‌లో జరిగిన ఐసీసీ బోర్డు సమావేశంలో జరిగిన ఓటింగ్‌లో ఆమోద ముద్రపడింది. అత్యంత సంపన్న బోర్డుగా ఐసీసీలో చక్రం తిప్పిన భారత్ బోర్డును.. ఐసీసీ ఛైర్మన్‌ శశాంక్‌ మనోహర్‌ చావుదెబ్బ కొట్టాడు. పాలనా వ్యవస్థలో మార్పుల ఓటింగ్‌లో బీసీసీఐ 1-9తో చిత్తుగా ఓడింది. దీనివల్ల భారత వాటా రూ.3667 కోట్ల నుంచి సగానికి పడిపోనుంది. 
 
నిజానికి సరికొత్త ప్రతిపాదనలను ఓటింగ్‌లో పాస్‌ కాకుండా అడ్డుకోగలమని బీసీసీఐ ధీమాగా ఉంది. అందుకు జింబాబ్వే, బంగ్లాదేశ్‌, శ్రీలంక బోర్డులతో చర్చలు నడిపి తగిన మద్దతు కూడా కూడగట్టింది. అయితే కీలక ఓటింగ్‌ సమయంలో జింబాబ్వే, బంగ్లాదేశ్‌లు హ్యాండిచ్చాయి. దీంతో భారత్ ఏకాకి అయింది.

వెబ్దునియా పై చదవండి