ఇంగ్లండ్ లక్ష్యఛేదనలో దూకుడు చూపిస్తున్నప్పటికీ చివరివరకు గెలుపు విషయంలో తనకెలాంటి సందేహం లేదని భారత క్రికెట్ జట్టు సీనియర్ బౌలర్ ఆశిష్ నెహ్రా తెలిపారు. నాలుగు ఓవర్లలో 32 పరుగుల లక్ష్యంతో ఇంగ్లండ్ విజృంభిస్తున్నప్పటికీ రెండో టీ-20 ఆటలో మనమే గెలువబోతున్నామని బుమ్రాతో చెప్పానంటున్న నెహ్రా తీవ్రమైన ఒత్తిడితో సాగుతున్న గేమ్‌లో బుమ్రా అద్భుతమైన బౌలింగ్ ప్రదర్శన ఇదేమీ తొలిసారి కాదని తెలిపాడు. ఇంగ్లండును నిలవరించడానికి బుమ్రాను స్వేచ్ఛగా బౌలింగ్ చేయనివ్వాలని తాను కోరుకున్నానని రెండో టీ-20లో అతని నైపుణ్యానికి నిజంగా అభినందనలు తెలుపుతున్నానని నెహ్రా ప్రశంసించాడు.
డెత్ ఓవర్లలో అద్వితీయ బౌలింగ్‌తో భారత్‌ను గెలిపించడం బుమ్రాకు ఇది తొలిసారేమీ కాదని నెహ్రా చెప్పాడు. లెంగ్త్ బాల్స్ వేయొచ్చా అని చివరి ఓవర్‌కు ముందు బుమ్రా తనను అడిగాడని, నీవు మంచి యార్కర్లు వేయగలవు. ఫుల్ బాల్స్ వేయడానికి ప్రయత్నించు, ఈ దశలో లో ఫుల్ టాస్ బంతి సంధించినా బ్యాట్స్‌మన్ దాన్ని సిక్స్‌గా మలచడం చాలా కష్టమని చెప్పాను. సరిగ్గా అది పనిచేసింది. నాలుగు ఓవర్లలో 32 పరుగులు ఇంగ్లండ్ చేయవలసి వచ్చినప్పుడే మనం గెలువబోతున్నామని బుమ్రాతో చెప్పాను అని నెహ్రా తెలిపాడు.