ఐదు వన్డే సిరీస్‌లో భాగంగా, ఆదివారం చెన్నైలోని చిదంబరం స్టేడియంలో ఆస్ట్రేలియా, భారత్ జట్ల మధ్య తొలి వన్డే మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ ఆరంభం నుంచే కష్టాల్లోపడింది. కేవలం 87 పరుగులకే ఐదు కీలక వికెట్లు కోల్పోయింది.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ 11 పరుగుల వద్ద అజింక్యా రహానే (5) రూపంలో తొలి వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత అదే స్కోరు వద్ద కెప్టెన్ కోహ్లీ (0), మనీష్ పాండే (0) వికెట్లను కోల్పోయింది. ఆ తర్వాత కేదార్ జాదవ్‌తో కలిసి రోహిత్ శర్మ జాగ్రత్తగా ఆడుతూ మరో వికెట్ పడిపోకుండా జాగ్రత్త పడ్డాడు. అయితే జట్టు స్కోరు 64 పరుగుల వద్ద ఉన్నప్పుడు రోహిత్ శర్మ (28) అవుటయ్యాడు.
ఆ తర్వాత ధోనీ, ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాలు నెమ్మదిగా ఆడుతూ.. జట్టు ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. వీరిద్దరూ ఏకంగా ఆరో వికెట్‌కు 118 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ముఖ్యంగా హార్దిక్ పాండ్యా ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడ్డారు. 66 బంతుల్లో ఐదు ఫోర్లు, ఐదు సిక్సర్లతో 83 పరుగుల చేసి, జంపా బౌలింగ్‌లో ఫాల్క్‌నర్‌కు క్యాచ్చి వెనుదిరిగాడు.
ఈ క్రమంలో ధోనీతో జతకలిసిన భువనేష్ కుమార్.. మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడ్డారు. అదేసమయంలో ధోనీ అర్థ సెంచరీ పూర్తి చేశాడు. 47 ఓవర్లు ముగిసే సమయానికి భారత్ 6 వికెట్ల నష్టానికి 246 పరుగులు చేసింది. చివరి ఐదు ఓవర్లు మిగిలి ఉన్న సమయంలో ఫోర్లు, సిక్సర్లతో అలరించాడు. చివరకు 49.4 ఓవర్ల వద్ద 79 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద భారీ షాట్ కి ప్రయత్నించి ఔటయ్యాడు. కాగా ధోనీ, హార్థిక్ పాండ్యా మెరుపు ఇన్నింగ్స్‌లతో టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 281 పరుగులు రాబట్టింది. తద్వారా టీమిండియా ఆస్ట్రేలియా ముందు 282 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్ధేశించింది.