ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2018లో మెరిసిన మరో క్రికెట్ ఆణిముత్యం రషీద్ ఖాన్. ఇతగాడు ఆప్ఘనిస్థాన్ దేశస్తుడు. కానీ, ఇతగాడి క్రికెట్‌కు భారత క్రికెట్ అభిమానులు ఫిదా అయిపోయారు. అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్‌లలో రాణించడమే కాకుండా మైదానంలో పాదరసంలా కదులుతూ ప్రతి ఒక్కరి దృష్టిని ఆకర్షించాడు. దీంతో అతనికి భారత పౌరసత్వం కల్పించి, భారత క్రికెట్ జట్టులో చోటు కల్పించాలన్న డిమాండ్లు వస్తున్నాయి. ఈ మేరకు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది.
అయితే, కొందరు నెటిజన్లు ఒక అడుగు ముందకేసి.. రషీద్‌కు భారత పౌరసత్వం ఇప్పించాలని విదేశీ వ్యవహారాల శాఖా మంత్రి సుష్మా స్వరాజ్‌ను కోరారు. కావాలంటే భారత క్రికెటర్ రవీంద్ర జడేజాను ఆప్ఘనిస్థాన్ క్రికెట్‌కు ఇచ్చేసి రషీద్‌ను టీమిండియాలోకి తీసుకునేలా అఫ్ఘాన్ బోర్డుతో ఒప్పందం కుదుర్చుకోవాలని బీసీసీఐకి సలహా కూడా ఇచ్చారు. దీనిపై సుష్మాతో పాటు, అఫ్ఘాన్ అధ్యక్షుడు కూడా స్పందించిన విషయం తెలిసిందే.
ఈ వ్యవహారంపై ఆప్ఘనిస్థాన్ క్రికెట్ బోర్డు ఛైర్మన్ అతీఫ్ మషల్ స్పందించాడు. 'రషీద్ ఖాన్ కోసం ఆఫర్ చేస్తున్నవారందికి థ్యాంక్స్. ప్రపంచ వ్యాప్తంగా అతడికెంత డిమాండ్ ఉందో నాకు తెలుసు. కానీ, అతడు ఎక్కడికీ వెళ్లడు. ఎందుకంటే.. అతడు అఫ్ఘాన్ దేశస్థుడిగానే గర్వపడుతున్నాడు' అంటూ ట్వీట్ చేశాడు.