ఐపీఎల్ 14 సీజన్ ఎనిమిది జట్లతోనే : బీసీసీఐ

గురువారం, 24 డిశెంబరు 2020 (20:28 IST)
భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ)కు కాసుల వర్షం కురిపించే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 14వ సీజన్ పోటీలు వచ్చే యేడాది మార్చి, ఏప్రిల్, మే నెలల్లో జరుగనున్నాయి. ఈ యేడాది స్వదేశంలో జరగాల్సిన ఐపీఎల్ 13వ సీజన్ పోటీలు కరోనా మహమ్మారి కారణంగా యూఏఈ వేదికగా నిర్వహించిన విషయం తెల్సిందే. స్టేడియాల్లో ప్రేక్షకులు లేకుండానే ఈ పోటీలను నిర్వహించినప్పటికీ.. ఇవి విజయవంతమయ్యాయి. దీంత వచ్చే యేడాది షెడ్యూల్ ప్రకారమే ఈ పోటీలు నిర్వహించేందుకు బీసీసీఐ సన్నాహాలు చేస్తోంది. 
 
ఇందులోభాగంగా, గురువారం బీసీసీఐ వార్షిక సర్వసభ్య సమావేశం జరిగింది. ఇందులో 2022 సీజన్ నుంచి ఐపీఎల్ లో 10 జట్లు క్రికెట్ వినోదాన్ని అందించనున్నాయి. ఈ మేరకు రెండు కొత్త జట్ల ప్రవేశానికి బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. 
 
అయితే, 2021 సీజన్ నుంచే 10 జట్లతో ఐపీఎల్ జరపాలని కొందరు సభ్యులు ప్రతిపాదించినా, ఇప్పుడంత సమయం లేదని, రెండు కొత్త జట్లకు బిడ్డింగ్‌లు పిలవాల్సి ఉండడంతో నూతన ఫ్రాంచైజీలను హడావిడిగా నిర్ణయించలేమని బోర్డు యాజమాన్యం వివరణ ఇచ్చింది. 
 
ఇక, 2028 ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను కూడా చేర్చాలన్న ఐసీసీ నిర్ణయానికి సూత్రప్రాయంగా మద్దతు పలకాలని నేటి సమావేశంలో నిర్ణయించారు. ముందుగా, ఒలింపిక్స్‌లో క్రికెట్ ప్రవేశం విధివిధానాలపై ఐసీసీ నుంచి తగిన స్పష్టత కోరాలని భావిస్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు