ఐసీసీ ఛైర్మన్ పదవికి శశాంక్ మనోహార్ రాజీనామా

బుధవారం, 15 మార్చి 2017 (14:11 IST)
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ఛైర్మన్ పదవికి శశాంక్ మనోహార్ బుధవారం రాజీనామా చేశారు. ఆయన రాజీనామా తక్షణమే అమల్లోకి వచ్చింది. వ్యక్తిగత కారణాలతో ఛైర్మన్‌ పదవికి రాజీనామా చేస్తున్నట్టు ఆయన ప్రకటించారు. అయితే అధికారికంగా ఇంకా దానిని ఆమోదించలేదని ఓ ఐసీసీ అధికారి వెల్లడించారు.
 
బీసీసీఐ మాజీ చీఫ్ ఎన్.శ్రీనివాసన్ నుంచి శశాంక్ మనోహర్ ఐసీసీ ఛైర్మన్ పదవిని స్వీకరించిన సంగతి తెలిసిందే. ఐసీసీ ఛైర్మన్‌గా మే, 2016న పదవీ బాధ్యతలు చేపట్టారు. ఈ పదవికి ఏకగ్రీవంగా ఎన్నికై ఈ పదవి చేపట్టిన తొలి ఇండిపెండెంట్‌ ఛైర్మన్‌గా నిలిచారు. అయితే, యేడాది కూడా ముగియకుండానే ఐసీసీ ఛైర్మన్ పదవి నుంచి శశాంక్ మనోహర్ తప్పుకోవడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. 
 
'నా వరకు అత్యున్నత సేవలను ఐసీసీకి అందించాను. కీలక నిర్ణయాలు తీసుకొనే సమయంలో నిష్పాక్షికంగా వ్యవహరించాను. సభ్య దేశాల డైరెక్టర్లు చక్కటి సహకారాన్ని అందించారు. అయితే వ్యక్తిగత కారణాల వల్ల ఛైర్మన్ పదవిలో కొనసాగలేకపోతున్నా. అందుకే రాజీనామా సమర్పిస్తున్నా. అందరు డైరెక్టర్లు, మేనేజ్‌మెంట్‌, ఐసీసీ స్టాఫ్ అందరికీ కృతజ్ఞతలు. భవిష్యత్తులో ఐసీసీ మరిన్ని అత్యున్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షిస్తున్నా' అని శశాంక్ మనోహర్ తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు. 

వెబ్దునియా పై చదవండి