పాకిస్తాన్‌తో తేలిపోయాం.. నిజమే కానీ భారత్‌ పని మాత్ర పడతాం..సఫారీల అతిశయం

శుక్రవారం, 9 జూన్ 2017 (05:46 IST)
పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో సాధారణ ఆటతీరుతో డక్‌వర్త్‌ లూయిస్‌ దెబ్బతో యధాప్రకారం ఓటమి పాలైన దక్షిణాఫ్రికా.. భారత్‌తో జరిగే చివరిలీగ్‌ మ్యాచ్‌లో తమ ప్రత్యేకత చూపిస్తామని శపథం చేసింది. ఆదివారం భారత్‌తో జరిగే పోరు తమకు చాలా కీలకమని, ఆ జట్టుపై గెలుపొందేందుకు టీమంతా సమిష్టి ఆటతీరు ప్రదర్శించాల్సి ఉంటుందని దక్షిణాఫ్రికా జట్టు పేసర్‌ మోర్నీ మోర్కెల్‌ పేర్కొన్నాడు. పాక్‌తో మ్యాచ్‌లో నిరాశజనక ఆటతీరు ప్రదర్శించిన తాము, భారత్‌తో మ్యాచ్‌లో తప్పకుండా అసాధారణ ఆటతీరు ప్రదర్శిస్తామని ఆశాభావం వ్యక్తం చేశాడు.
 
గత ఎనిమిది నెలలుగా జట్టులో తన స్థానంపై అనిశ్చితి నెలకొందని, అయితే బరిలోకి దిగిన ప్రతిసారి ఉత్తమ ప్రదర్శన కనబర్చేందుకు ప్రయత్నించానని మోర్నీ మోర్కెల్‌పేర్కొన్నాడు. మరోవైపు ప్రొటీస్‌ కోచ్‌ రసెల్‌ డొమింగో తన జట్టును వెనకేసుకొచ్చాడు. పాక్‌తో మ్యాచ్‌లో కెరీర్‌లో తొలిసారి మొదటి బంతికే డకౌటైన కెప్టెన్‌ ఏబీ డివిలియర్స్‌ను సమర్థించాడు. 
 
కెరీర్‌లో చాలా మంది తొలి బంతికే వెనుదిరిగే సందర్భం వస్తుందని, అయితే ఏబీకి ఇది జరగడానికి 200 వన్డేలకుపైగా సమయం పట్టిందని పేర్కొన్నాడు. భారత్‌తో జరిగే మ్యాచ్‌లో ఏబీ నుంచి భారీ ప్రదర్శన ఆశిస్తున్నామని, జట్టుకు అవసరమైన వేళ ఏబీ తప్పకుండా రాణిస్తాడని రసెల్‌ విశ్వాసం వ్యక్తం చేశాడు. 
 
దక్షిణాఫ్రికా దురదృష్టమో... వాన వైపరీత్యమో కానీ... సఫారీ జయాపజయాల్ని ప్రతిసారీ  ‘డక్‌వర్త్‌ లూయిస్‌’ కాలరాస్తోంది. గత 11 మ్యాచ్‌ల డీఎల్‌ ఫలితాల్లో 8 సార్లు జట్టు పరాజయాన్నే చవిచూసింది. 2015 నుంచి ఇప్పటి వరకు ‘డక్‌వర్త్‌’ తేల్చిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ దక్షిణాఫ్రికా గెలవలేకపోయింది.
 

వెబ్దునియా పై చదవండి