న్యూయార్క్‌లో ఫ్రాన్స్ బహుమతి "స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ"

SOLEIF

ప్రపంచంలో వలసవాదాన్ని తరిమికొట్టి స్వేచ్చా వాయువులు పీల్చుకున్న పోరాటం అమెరికన్ విప్లవం. రవి అస్తమించని బ్రిటీష్ సామ్రాజ్యాన్ని ప్రపంచమంతటా నెలకొల్పాలని భావించిన బ్రిటీష్ సామ్రాజ్యవాదులను మట్టికరిపించి జయకేతనం ఎగురవేసింది అమెరికన్ విప్లవం.

అమెరికన్ విప్లవం విజయానికి గుర్తుగా 1886లో వందో సంవత్సర వేడుకలను జరుపుకునే సందర్భంలో అమెరికన్ ప్రజానీకానికి... ఫ్రెంచ్ ప్రభుత్వం "స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ" విగ్రహాన్ని కానుకగా సమర్పించింది. అమెరికా యొక్క ప్రత్యేక గుర్తింపుగా మిగిలిన ఈ ప్రఖ్యాత శిల్పం న్యూయార్క్ ఓడను చేరుకున్న రోజునే చరిత్రలో జూన్ 17 ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు.

దీని అధికారిక నామం "లిబర్టీ ఎన్‌లైటింగ్ ది వరల్డ్". పైకి ఎత్తి ఉంచిన కుడిచేతిలో ప్రకాశవంతంగా వెలుగుతున్న కాపర్ టార్చ్ (దివిటీ)తో, ఎడమచేతి పిడికిలో ఏదో గట్టిగా పట్టుకుని ఉన్నట్లుగా ఉంటుందీ విగ్రహం. కాగా, ఈ విగ్రహంలో కాగడా పట్టుకున్న చేతి పొడవు 42 అడుగులు కాగా... విగ్రహం మొత్తం పొడవు 151 అడుగులు ఉంటుంది.

ఇంతకీ విగ్రహం ఎడమచేతి పిడికిలిలో ఏముంటుందో మీకు తెలుసా...?! ఆ మూసి ఉంచిన గుప్పిట్లో జూలై 4, 1776 అనే అంకెలు ఉన్న ఒక ఫలకం ఉంటుంది. మనకు 1947 ఆగస్టు 15వ తేదీన స్వాతంత్ర్యం వచ్చినట్లుగానే... అమెరికాకు కూడా జూలై 4, 1776 సంవత్సరంలో వచ్చింది. కాబట్టి, ఆ ఫలకంలో స్వాతంత్ర్యానికి గుర్తుగా పై అక్షరాలు వచ్చేలా రూపొందించారు.

స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ విగ్రహాన్ని... విప్లవ సమయంలో ఇరుదేశాల నడుమగల స్నేహ సంబంధాలను గుర్తుగా ఫ్రెంచి ప్రభుత్వం అక్టోబర్ 28, 1886న బహూకరించింది. ఇదిలా ఉంటే... ఈ విప్లవ యుద్ధంలో విజయం సాధించాలంటే.. అమెరికాకు ఫ్రెంచివారి సహాయ సహకారాలు అత్యవసరమైనాయి. దీంతో స్నేహ హస్తాన్ని చాచిన ఫ్రెంచి ప్రభుత్వం అమెరికాకు అనుకూలంగా సైన్యాన్ని, యుద్ధ ఓడలను, ఆయుధాలను, డబ్బును సమకూర్చింది.

వెబ్దునియా పై చదవండి