మానవ శరీరంలో మరో కొత్త అవయవాన్ని శాస్త్రవేత్తలు కనిపెట్టారు. ఇది మనిషి జీర్ణ వ్యవస్థలో గుర్తించారు. శరీరంలో పొత్తి కడుపును, పేగును కలిపి ఉంచే ఈ అవయవం పేరు మెసెంటరీ. వందల ఏళ్లుగా దీనిని జీర్ణ వ్యవస్థలోని కొన్ని అవయవాల్లో అంతర్భాగంగానే భావిస్తూ వచ్చారు. అయితే ఇది ఒక ప్రత్యేకమైన అవయవమని ఐర్లాండ్‌కు చెందిన యూనివర్సిటీ ఆఫ్ లైమ్‌రిక్ శాస్త్రవేత్త కెల్విన్ కొఫే తెలిపారు.
దీనిని గుర్తించడం ద్వారా జీర్ణ వ్యవస్థ సంబంధమైన వ్యాధులకు మెరుగైన వైద్యం అభివృద్ధి చేయవచ్చన్నారు. అయితే మెసెంటరీ (పసుపు రంగులో ఉండే భాగం) లక్షణాలను, పనితీరును అధ్యయనం చేయాల్సి ఉందని కెల్విన్ చెప్పారు. ఇది పూర్తయితే జీర్ణవ్యవస్థకు సంబధించిన వ్యాధులకు కోత పెట్టే శస్త్రచికిత్సలను తగ్గించడంతో పాటు, చౌకైన వైద్యం అందుబాటులోకి తీసుకుని రావొచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ పరిశోధన విజయవంతమైతే వైద్య విద్యార్థులకు బోధించే శరీర నిర్మాణ సిలబస్ (అనాటమీ)ని తిరగరాయాల్సి ఉంటుంది.