చైనా నుంచి పుట్టుకొచ్చిన కరోనా వైరస్‌పై రోజుకో షాకింగ్ న్యూస్ వెలుగులోకి వస్తోంది. తాజాగా పరిశోధకులు షాకిచ్చే విషయాన్ని తెలిపారు. కోవిడ్‌ను ఎదుర్కొనేందుకు శరీరంలో తయారైన రోగనిరోధక శక్తి కొన్ని నెలల్లోనే మాయం అవుతోందని లండన్ పరిశోధకులు చెప్తున్నారు. ప్రభుత్వాలు ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకొని భవిష్యత్తు కార్యాచరణ సిద్ధం చేసుకోవాలని సూచిస్తున్నారు.
కింగ్స్ కాలేజ్ లండన్ పరిశోధకులు 90 మంది కొవిడ్-19 బాధితుల్లో యాంటీబాడీల స్థాయిలను అధ్యయనం చేశారు. కాలం గడిచే కొద్దీ అవి ఎలా మార్పు చెందుతున్నాయో పరిశీలించారు. స్వల్ప, మోతాదు లక్షణాలు ఉన్నవారి రోగనిరోధక వ్యవస్థ కొంతే స్పందించిందని రక్తపరీక్షల్లో గమనించారు. వ్యాధి సోకిన కొన్ని వారాల తర్వాత 60శాతం మందిలో చెప్పుకోదగ్గ స్థాయిలో వైరస్‌కు స్పందన కనిపించింది.