ఇరాన్ దేశంలోని దక్షిణ హార్మోజ్‌గాన్ ప్రావిన్స్‌లో గల ఓడరేవులో శనివారం భారీ పేలుడు సంభవించగా, ఇందులో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 40కి చేరినట్టు ఇరాన్ అధికారిక వార్తా సంస్థ ఐఆర్‌ఐబీ వెల్లడించింది. ఈ ఘోర ప్రమాదం నేపథ్యంలో ప్రభుత్వం సోమవారం జాతీయ సంతాపదినంగా ప్రకటించింది.
హార్మోజ్‌గాన్ గవర్నర్ మహమ్మద్ అషౌరీ తజియాని వెల్లడించిన వివరాల మేరకు.. పేలుడు తర్వాత అగ్నిప్రమాదం సంభవించిందని, దీంతో వెయ్యి మందికిపై గాయపడ్డారని తెలిపారు. వీరిలో 197 మందిని మెరుగైన చికిత్స నిమిత్తం ఆస్పత్రులకు తరలించారు. ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలు ఇంకా తెలియరాలేదని అధికారులు పేర్కొన్నారు. ప్రభుత్వ అధికార ప్రతినిధి ఫాతిమో మొహజెరాని సోషల్ మీడియా ద్వారా సంతాప దినం ప్రకటనను ధృవీకరించింది.