బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ సినీ కెరీర్‌లోని అతిపెద్ద బ్లాక్ బస్టర్ హిట్ మూవీగా నిలిచిన చిత్రం 'బజరంగీ భాయిజాన్'. పదేళ్ల క్రితం వచ్చిన ఈ చిత్రం ఘన విజయం సాధించింది. సల్మాన్ ఖాన్ 'బజరంగీ భాయిజాన్' పాత్రలో అందరి దృష్టిని ఆకర్షించగా, హర్షాలి పాత్రలో మల్హోత్రా మున్నీ అద్భుతంగా నటించింది. ఈ చిత్రానికి సీక్వెల్ తీసుకునిరావడానికి అన్ని సన్నాహాలు జరుగుతున్నాయనే ప్రచారం సాగుతోంది.
దీనిపై ఈ చిత్రానికి కథను అందించిన సినీ రచయిత విజయేంద్ర ప్రసాద్ స్పందించారు. 'బజరంగీ భాయిజాన్' మూవీకి సీక్వెల్‌కు సంబంధించి ఒక ఆలోచన చెప్పానని, ఆ ఆలోచన ఆయనకు నచ్చిందని, అయితే, ఏం జరుగుతుందో వేచి చూడాలన్నారు. ఇక డ్రీమ్ ప్రాజెక్టు "మహాభారతం" గురించి కొన్ని రోజుల క్రితం అమీర్ ఖాన్‌ను కలిశానని చెప్పారు.
కాగా, సల్మాన్ ఖాన్, రాక్‌లైన్ వెంకటేష్, కబీర్ ఖాన్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం సూపర్ హిట్ అయింది. భారతదేశానికి వచ్చి తప్పిపోయిన మున్నీ అనే పాకిస్థానీ అమ్మాయిని తిరిగి తన స్వస్థలానికి చేర్చడమే ఈ సినిమా కథాంశం. ప్రస్తుతం సల్మాన్ ఖాన్‌కు భారీ విజయం అత్యవసరమైన నేపథ్యంలో తన బ్లాక్ బస్టర్ మూవీకి రెండో భాగం తీయాలనే ఆలోచనలో ఉన్నారని తెలుస్తోంది. బజరంగీ భాయిజాన్-2 అధికారిక ప్రకటన కోసం సల్మాన్ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.