నరేంద్ర మోడీ వ్యూహాలతో ఏకాకులమై పోతాం : పాక్‌ ఆర్మీతో షరీఫ్‌

శుక్రవారం, 7 అక్టోబరు 2016 (11:11 IST)
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అనుసరిస్తున్న వ్యూహాలతో మనం ప్రపంచంలో ఏకాకులమై పోతామని పాకిస్థాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ ఆ దేశ ఆర్మీ చీఫ్‌తో వ్యాఖ్యానించారు. ముఖ్యంగా కాశ్మీరులో చెలరేగిన అల్లర్లు, ఉరీలో భారత సైన్యంపై ఉగ్రవాద దాడి దరిమిలా అంతర్జాతీయంగా ఏకాకిగా మారామని పాకిస్థాన్‌ ప్రభుత్వం వాపోయింది. 
 
షరీఫ్ ఆధ్వర్యంలో అఖిల పక్ష సమావేశం జరగడానికి ముందు పాక్‌ మిలిటరీ నాయకత్వం, షరీఫ్‌ సర్కారు మధ్య ఓ అజ్ఞాత ప్రదేశంలో రహస్య భేటీ జరిగింది. జైషే మహ్మద్‌, లష్కరే తాయిబా లాంటి ఉగ్రవాద సంస్థలపై ‘బయటకు కనబడే’ చర్యలు తీసుకోవాలని షరీఫ్‌ స్పష్టంచేశారు. 
 
ప్రస్తుత పరిస్థితుల్లో ఉగ్రవాదంపై చర్యలు తీసుకోవాల్సిందేనంటూ వ్యాఖ్యానించారు. లేకుంటే ప్రపంచదేశాలు పాక్‌ను మరింత దూరం పెడతాయని ఆయన తన సైన్యాన్ని హెచ్చరించారు. ఈ సందర్భంగా షరీఫ్ సోదరుడైన పంజాబ్‌ సీఎం షాబాజ్‌, ఐఎస్ఐ చీఫ్‌ రిజ్వాన్‌ల మధ్య తీవ్ర వాగ్యుద్ధం జరిగింది. పోలీసులు జైషే, లష్కరే ఉగ్రవాదులను అరెస్టు చేసినప్పుడల్లా ఐఎస్ఐ రంగంలోకి దిగి వారిని విడుదల చేయిస్తోందని షాబాజ్‌ మండిపడ్డారు. 

వెబ్దునియా పై చదవండి