'బొమ్మరిల్లు' చిత్రంలోని హాసిని పాత్ర జెనీలియా కెరీర్‌ను మార్చేసింది. తమిళం, హిందీ చిత్రాల్లో తానే ఆ పాత్ర పోషిస్తోంది. చేసింది చేయాలంటే బోర్ అనుకుంటాంగానీ ఆ పాత్ర చాలా నచ్చి చేస్తున్నానని జెనీలియా చెబుతోంది.
తాజాగా గుణ్ణం గంగరాజు నిర్మిస్తోన్న "కథ" చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రం నవంబర్ మొదటివారంలో విడుదలకానుంది. ఈ సందర్భంగా జెనీలియాతో జరిపిన ఇంటర్వ్యూ విశేషాంశాలు మీ కోసం..
ప్రశ్న: పాత్రల ఎంపికలో ఎటువంటి రూల్స్ పెట్టుకుంటారు? జ: ముందుగా బేనర్. తర్వాత దర్శకుడు, హీరోను చూస్తాను. నిజానికి నేను చాలా లక్కీ. నేను ఫలానా అని అనుకోకుండానే మంచి బేనర్ల నుంచి నాకు ఆఫర్లు వస్తున్నాయి. దర్శక, నిర్మాతలే నన్ను ప్రోత్సహిస్తున్నారు.
ప్రశ్న: ప్రస్తుతం ఎక్కువమంది తారలు బికినీలవైపు మొగ్గుచూపుతున్నారు? మీరు కూడా రెడీనా? జ: కాస్ట్యూమ్స్ విషయంలో నేనెప్పుడూ జాగ్రత్తగానే ఉంటాను. నేను కట్టుకునే బట్టలు సాధారణ యువతిని ప్రతిబింబిస్తాయి. "సై" చిత్రంలో కాస్త ఎక్స్‌పోజింగ్ చూపినా అది పాత్ర మేరకే. కొన్నిసార్లు కాస్ట్యూమ్స్ లేవని బికినీలు వేసుకోమంటే.. దానికి నేను దూరం. ముందు చెప్పినట్లు వస్త్రధారణ ఉంటేనే నటిస్తాను.
ప్రశ్న: బాలీవుడ్‌లో నటిస్తూ ఎక్స్‌పోజింగ్‌కు దూరమైతే పాత్రలు దూరమవుతాయేమో? జ: అదేం లేదు. నాకు ముఖాన్ని ముఖకవళికలను ఎక్స్‌పోజింగ్ చేయడమే తెలుసు. అంతకు మించి బాడీ ఎక్స్‌పోజింగ్ చేయను.
ప్రశ్న: రితీష్ దేశ్‌ముఖ్‌తో మీ వ్యవహారం పెండ్లిదాక వచ్చిందనే వార్తలు వచ్చాయి? జ: రితీష్ మంచి స్నేహితుడు మాత్రమే. నేను ప్రేమిస్తే, పెండ్లిచేసుకుంటే ముందు మీకే (మీడియా)కు చెబుతాను.
ప్రశ్న: ఎటువంటివాడైతే ఇష్టపడతారు? జ: నన్ను నన్నుగా గౌరవించాలి. కమాండింగ్ చేసేవాళ్ళంటే నాకు నచ్చదు.
ప్రశ్న: ఈ మధ్య టీవీషోలు చేస్తున్నారు? ఎంతవరకు వచ్చింది? జ: అవును. స్లమ్ ఏరియాలో రియాల్టీ షో చేశాను. అక్కడ ఉన్నత కుటుంబ విద్యార్థులు పది మంది, స్లమ్ ఏరియాలోని వారు పది మంది ఉంటారు. రిచ్ ఫ్యామిలీ పిల్లలు ఇక్కడ వచ్చి ఉండాలి. వీరు అక్కడ ఉండాలి. ఇలా సాగే షో అది. దీనికోసం నేను కొద్దిరోజులు స్లమ్ ఏరియాలో ఉన్నాను. ఇదంతా పిల్లల్లో చైతన్యం తేవడానికే.
ప్రశ్న: ఇంతకీ కథలో టీచర్‌గా నటిస్తున్నారు. హీరోకు ఏం చెబుతున్నారు? జ: ప్రేమ పాఠాలు కాదు. అతను కో డైరక్టర్‌గా అరకు ప్రాంతానికి వస్తాడు. అనుకోకుండా ఓ సంఘటనలో నన్ను కలుస్తాడు. అక్కడ నుంచి కథంతా సస్పెన్స్‌గా సాగుతుంది. తనకు ఒక కథ నాకు చెబుతాడు. నేను అతనికి ఓ కథ చెబుతాను. ఇద్దరు చెప్పింది కథే సినిమా. అది చాలా థ్రిల్‌గా ఉంటుంది.
ప్రశ్న: కొత్త సినిమా వివరాలు? జ: ప్రస్తుతం అంజనా ప్రొడక్షన్స్‌లో రామ్‌చరణ్‌తేజతో నటిస్తున్నాను. ఆ తర్వాత మరో అగ్ర సంస్థ చిత్రంలో నటిస్తాను. ఆ వివరాలు త్వరలో చెబుతాను.