నిమ్మ సువాసనలతో "రవ్వ పులిహోర"

కావలసిన పదార్థాలు :
బియ్యంరవ్వ.. 2 కప్పులు
నిమ్మకాయలు.. 2
ఇంగువ.. అర టీ.
వేరుశెనగ గింజలు.. ఒక టీ.
ఉప్పు.. సరిపడా
నూనె.. 6 టీ.
పసుపు.. ఒక టీ.
కరివేపాకు.. 4 రెబ్బలు
పచ్చిమిర్చి.. 2
ఆవాలు... అర టీ.
ఎండుమిర్చి.. 2
సెనగపప్పు.. 2 టీ.
మినప్పప్పు.. 2 టీ.

తయారీ విధానం :
బియ్యం రవ్వలో పసుపు, ఒక టీస్పూన్ ఉప్పు, ఒక టీస్పూన్ నూనె వేసి.. ఒకటికి రెండు చొప్పున 4 కప్పుల నీళ్లు పోసి కుక్కర్లో ఉడికించాలి. 3 విజిల్స్ వచ్చిన తరువాత దించేసి.. ఉడికిన రవ్వను పొడి పొడిగా చేసి చల్లారనివ్వాలి. ఒక బాణలిలో 5 టీస్పూన్ల నూనె వేసి పచ్చిమిర్చి, ఇంగువ, వేరుశెనగ గింజలు వేసి వేయించాలి.

తరువాత కరివేపాకు, పచ్చిమిర్చి, ఆవాలు, ఎండుమిర్చి, శెనగపప్పు, మినప్పప్పులతో పోపు పెట్టాలి. అందులోనే నిమ్మరసం, సరిపడా ఉప్పును కలిపి.. మొత్తాన్ని ఉడికించిన రవ్వలో కలిపి పైన కొత్తిమీర చల్లితే నోరూరించే రవ్వ పులిహోర తయార్..! ఇష్టమైనవారు ఇందులో క్యారెట్ తురుమును కూడా కలుపుకోవచ్చు.

వెబ్దునియా పై చదవండి