వివాహ వేడుకలో వధువు మృతి.. చెల్లెలితో వరుడికి పెళ్లి.. మృతదేహాన్ని గదిలో పెట్టి..?
శనివారం, 29 మే 2021 (14:50 IST)
ఉత్తరప్రదేశ్‌లోని ఒక వివాహ వేడుకలో విషాదం చోటు చేసుకుంది. వివాహ వేడుకలో వధువు అస్వస్థతతో కుప్పకూలిపోయారు. ఆమెకు చికిత్సనందించేందుకు వచ్చిన వైద్యుడు అప్పటికే వధువు మరణించిందని ధ్రువీకరించారు. ఆమె గుండెపోటు వల్ల కుప్పకూలిందని వెల్లడించారు.
అయితే, ఇరు కుటుంబాలు రాజీకి వచ్చాయి. వధువు సోదరికి, వరుడికి వివాహం చేయాలని నిర్ణయించాయి. ఈ ఘటన ఎటావా జిల్లా భర్తానాలోని సమస్పూర్‌లో రెండు రోజుల క్రితం జరిగింది.
వివాహ వేడుక పూర్తవుతున్న సమయానికి వధువు సురభి.. వరుడు మంజేశ్ కుమార్ పక్కన అకస్మాత్తుగా కుప్పకూలిపోయారు. భారీ గుండెపోటు వల్ల మరణించాడని వైద్యుడు తేల్చి చెప్పారు.
ఇటువంటి పరిస్థితుల్లో ఏం చేయాలో తమకు తెలియదని సురభి సోదరుడు సౌరభ్ చెప్పారు. ఇరు కుటుంబాల మధ్య తమ చిన్న సోదరి నిషను వరుడికి ఇవ్వాలన్న ప్రతిపాదన వచ్చిందన్నారు. రెండు వైపులా చర్చించుకుని అంగీకారానికి వచ్చారన్నారు.
దీంతో సురభి మృతదేహాన్ని పక్క రూములో పెట్టి.. నిషతో మంజేశ్ వివాహం పూర్తి చేశారు. పెండ్లి యాత్ర ముగిశాక సురభి అంత్యక్రియలు నిర్వహించామని సౌరభ్ చెప్పారు.
సురభి మామ అజాబ్ సింగ్ మాట్లాడుతూ.. ఇది తమ కుటుంబానికి క్లిష్ట సమయం అని చెప్పారు. మరణించిన కుమార్తె మృతదేహాన్ని రూంలో పెట్టి, మరో కూతురి వివాహం చేస్తామని తామెప్పుడూ అనుకోలేదన్నారు.