భారత వృద్ధి రేటుతో వణుకుతున్న చైనా.. తేలిగ్గా తీసుకోవద్దని ప్రభుత్వ మీడియా హెచ్చరిక

శుక్రవారం, 12 మే 2017 (05:32 IST)
భారత వృద్ధి రేటు అంటే చైనాకు ఎప్పుడూ చిన్నచూపే. సందు దొరికినప్పుడల్లా భారత ఆర్థిక వ్యవస్థ గురించి హేళన చేయడం చైనా నాయకత్వానికీ, దాని మీడియాకు కూడా పరిపాటే. కానీ మొదటసారిగా భారత పురోగతిని చూసి చైనాకు భయం తగిలినట్లు సంకేతాలు వెలువడ్డాయి. భారత ఆర్థిక వ్యవస్థ పురోగమనంపై చైనా మరీ అలసత్వం ప్రదర్శించరాదని, చైనా అభివృద్ధి నమూనాను భారత్ కాపీ కొట్టడం ప్రారంభించిందంటే గ్లోబల్ పెట్టుబడులు భారత్‌వైపు భారీగా వెళ్లే ప్రమాదం ఉందని చైనా ప్రభుత్వ మీడియా హెచ్చరిస్తూ తొలిసారిగా కథనాలు ప్రచురించింది. భారత్ విషయంలో ఇక ఏమాత్రం తాత్సారం చేయవద్దని అది హెచ్చరించింది.
 
చైనా కమ్యూనిస్టు పార్టీ అంతర్జాతీయ వ్యవహారాలపై తీసుకువస్తున్న వార్తా పత్రిక గ్లోబల్ టైమ్స్ బుధవారం భారత్ గురించి కథనం ప్రచురించింది. ప్రపంచ వ్యాప్తంగా పెట్టుబడులను మరింతగా ఆకర్షించడంలో భారత్ సక్సెస్ అవుతోందని, దీన్ని చైనా తప్పకుండా సీరియస్‌గా తీసుకోవాలని ఆ పత్రిక హెచ్చరించింది. భారత్‌కు అనుకూలమైన అంశం దాని జనాభాయేని, చైనాలో జనాభాపరమైన సానుకూల అంశం రాన్రానూ క్షీణించిపోతుండగా, భారత్‌లో సంగకంటే ఎక్కువ జనాభా 25 ఏళ్ల లోపువారేనని, ఇది ఆ దేశానికి చాలా ప్రయోజనం కలిగించనుందని గ్లోబల్ టైమ్స్ పేర్కొంది. భారత సోలార్ రంగం బయటి పెట్టుబడిల సహాయం లేకుండానే వేగంగా సాగుతోందని పేర్కొంది. 
 
భారత్ ఉద్దేశపూర్వకంగానే  గ్లోబల్ పెట్టుబడిదారుల ముందు స్పర్థా వాతావరణాన్ని సృష్టంచగలిగిందంటే అప్పుడది చైనాను సవాలు చేస్తుందని గ్లోబల్ టైమ్స్ పేర్కొంది. భారత్ తన విస్తార మార్కెట్, పరిమాణం, లేబర్ ఖర్చులు, భారీ జనసంఖ్య వంటి అంశాల ద్వారా  చైనా ఆర్థిక నమూనాను యధాతథంగా కాపీ చేయగలిగిన పరిస్థితులను కలిగి ఉందని ఆ పత్రిక పేర్కొంది. ఇవన్నీ చైనా పరిస్థితులనే పోలి ఉన్నాయని వ్యాఖ్యానించింది. ఇన్నాళ్లకు భారత్ విదేశీ పెట్టుబడిదారుల దృష్టిని తనవైపు మరల్చుకోగలుగుతోందని దీనికి భారత సోలార్ ఇంధన రంగమే ఉదాహరణ అని ఎత్తి చూపింది. 
 
వచ్చే అయిదేళ్లలో 100 బిలియన్ డాలర్ల వ్యయంతో దేశంలో భారీ సోలార్ పార్కులను నిర్మించడం ద్వారా శిలాజ ఇంధనాల ఉపయోగాన్నితగ్గించి స్వచ్చ ఇంధన ఉత్పత్తిని పెంచుకోవడంపై ప్రధాని నరేంద్రమోదీ   ఆశల్ని చైనా పత్రిక ఎత్తి చూపింది. ఇదే జరిగితే ప్రపచంలో ఏ దేశం కూడా పెట్టుబడుల ఆకర్షణలో భారత్‌కో పోటీ పడలేదని చైనా పత్రిక హెచ్చరించింది.
 

వెబ్దునియా పై చదవండి