కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఇటీవల వాయనాడ్ నియోజకవర్గంలో పర్యటించారు. దారిలో ఊటీలో నిర్వహిస్తున్న చాక్లెట్ల తయారీ కంపెనీని సందర్శించారు. అక్కడ కంపెనీ ఉత్పత్తులను రుచి చూసి, అక్కడి సిబ్బందితో ముచ్చటించి, కలిసి డెజర్ట్‌లు తయారు చేశారు. 60 మందికి పైగా మహిళలతో నిర్వహిస్తున్న సంస్థపై రాహుల్ గాంధీ ప్రశంసలు గుప్పించారు.
చిన్న, సూక్ష్మ, మధ్యతరహా పరిశ్రమలను రక్షించేందుకు జీఎస్టీని ఏకరీతిగా అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని అభ్యర్థించారు. ఈ విషయమై ఆయన మాట్లాడుతూ:- ఇటీవల నేను వాయనాడ్‌కు వెళుతున్నప్పుడు ఊటీలోని అత్యంత ప్రసిద్ధ చాక్లెట్ తయారీ కంపెనీని సందర్శించిన ఆహ్లాదకరమైన అనుభవం కలిగింది.
అయితే, దేశవ్యాప్తంగా ఉన్న లెక్కలేనన్ని ఇతర ఎంఎస్ఎంఈల మాదిరిగానే, ఈ కంపెనీ కూడా జీఎస్టీ ద్వారా తీవ్రంగా దెబ్బతింది. ఎంఎస్ఎంఈ రంగానికి నష్టం కలిగించే విధంగా ప్రభుత్వం పెద్ద కంపెనీలకు అనుకూలంగా వ్యవహరిస్తోంది.