జమ్మూకాశ్మీర్‌లో మళ్లీ టెలిఫోన్ సేవల పునరుద్ధరణ

సోమవారం, 14 అక్టోబరు 2019 (16:15 IST)
జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో మళ్లీ మొబైల్ రింగ్ టోన్ శబ్దాలు వినిపిస్తున్నాయి. గత రెండు నెలలుగా మూగబోయిన మొబైల్ ఫోన్లు ఎట్టకేలకు మళ్లీ రింగ్ అవుతున్నాయి. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో సోమవారం నుంచి మొబైల్ ఫోన్ సేవలను ప్రభుత్వం పునరుద్ధరించింది. సోమవారం మధ్యాహ్నం 12 గంటల నుంచి మొబైల్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. అయితే దాదాపు 20 లక్షలకు పైగా ప్రీపెయిడ్ మొబైల్ కనెక్షన్లు, ఇతర ఇంటర్నెట్ సేవలు ఇంకా అచేతన స్థితిలోనే ఉన్నాయి.
 
జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో 370 అధికరణను ఎత్తివేసిన తర్వాత రాష్ట్రంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా ముందు జాగ్రత్తగా టెలిఫోన్ సేవలపై ఆంక్షలు విధించిన విషయం తెల్సిందే. ప్రస్తుతం పరిస్థితులు చక్కబడటంతో ఆంక్షలను ఒక్కొక్కటిగా సడలిస్తున్నారు. 
 
తాజాగా, టెలీఫోన్ సర్వీసులతో పాటు జమ్మూ కాశ్మీర్‌‌లోని 99 శాతం ప్రాంతాల్లో రాకపోకలపై ఆంక్షలను ఎత్తివేశారు. ల్యాండ్ లైన్ సేవలు సైతం దాదాపు ఆరువారాల ముందు నుంచే పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చాయి. 
 
మరోవైపు, అక్టోబరు పదో తేదీ నుంచి పర్యాటకులను అనుమతిస్తున్నట్టు ఆ రాష్ట్ర గవర్నర్ సత్యపాల్ మాలిక్ ప్రకటించిన కొద్ది రోజులకే మొబైల్ సేవలను పునరుద్ధరిస్తూ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. దీంతో జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో పరిస్థితులు మెల్లగా కుదుటపడుతున్నాయని చెప్పొచ్చు. 
 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు