కర్ణాటక రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు వచ్చే యేడాది ఏప్రిల్ నెలలో జరుగనున్నాయి. ఈ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీకి ఓటమి తప్పదని, కమలనాథులు మళ్లీ పాగా వేయడం ఖాయమని ఎన్నికల అధ్యయన సంస్థ... క్రియేటివ్ సెంటర్ ఫర్ పొలిటికల్ అండ్ సోషియల్ స్టడీస్ (కాప్స్) తాజా అధ్యయనంలో తేలింది.
మొత్తం 224 సీట్లు రాష్ట్ర అసెంబ్లీలో ఈ సంస్థ చేపట్టిన సర్వే ప్రకారం భాజపా 113 స్థానాల్లో గెలిచి రాజ్యాధికార పగ్గాలను చేపడుతుందని తెలిపింది. అలాగే, కాంగ్రెస్ 86 చోట్ల, జనతాదళ్ 25 స్థానాలతోనే సంతృప్తి పడక తప్పదని వెల్లడించింది. గత ఏడాది నిర్వహించిన మూడు సర్వేల్లో భాజపా గెలిచే స్థానాల సంఖ్య 146 నుంచి 105కు ఆ తర్వాత గత ఏప్రిల్‌లో అది 72 స్థానాలకు తగ్గిపోయింది.
ఈ నేపథ్యంలో జులైలో నిర్వహించిన అధ్యయనంలో భాజపా గెలిచే అవకాశాలు ఉన్న నియోజకవర్గాల సంఖ్య 113కు పెరిగింది. ప్రతి నియోజకవర్గంలో 5 వేల మంది ఓటర్ల అభిప్రాయాల్ని సమీకరించారు. ఆ విధంగా మొత్తం 224 స్థానాల్లో 11.20 లక్షల మంది ఓటర్లను కలుసుకున్నారు. నాలుగు సర్వేల్లోనూ కాప్స్ మొత్తం 44.80 లక్షల మంది అభిప్రాయాల్ని సేకరించింది.