రాష్ట్రపతి రేసులో నేను లేను... ఎల్కే.అద్వానీ : వ్యూహాత్మక ఎత్తుగడేనా?

శుక్రవారం, 7 ఏప్రియల్ 2017 (16:17 IST)
భారతీయ జనతా పార్టీలో భీష్ముడిగా పేరుగాంచిన లాల్‌కృష్ణ అద్వానీ శుక్రవారం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రపతిగా ఉన్న ప్రణబ్ ముఖర్జీ పదవీకాలం త్వరలో ముగియనుంది. దీంతో తదుపరి రాష్ట్రపతిగా ఎల్కే.అద్వానీ ఎన్నిక కావొచ్చంటూ వార్తలు వచ్చాయి. వీటికి బలం చేకూర్చేలా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సైతం తన సన్నిహితుల వద్ద ఇదే ప్రస్తావన తెచ్చారు. అద్వానీని భారత రాష్ట్రపతి పీఠంపై కూర్చోబెట్టి తన గురు దక్షిణ తీర్చుకుంటానని వ్యాఖ్యానించినట్టు సమాచారం. 
 
దీంతో తదుపరి రాష్ట్రపతి ఎల్కే.అద్వానీ అని ప్రతి ఒక్కరూ భావిస్తూ వచ్చారు. అయితే, రాష్ట్రపతి రేసులో తాను లేనని ప్రకటించారు. దీంతో బీజేపీ వర్గాలు విస్మయం వ్యక్తంచేశాయి. పార్లమెంట్ వెలుపల మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రణబ్ ముఖర్జీ పదవి కాలం ముగియనుండటంతో రాష్ట్రపతి ఎన్నిక కోసం కసరత్తు మొదలైంది. 
 
అద్వానీ ప్రకటనతో తదుపరి రాష్ట్రపతి రేసులో బీజేపీ నుంచి ఎవరుంటారనే దానిపై సర్వత్రా చర్చ జరుగుతోంది. ఇదిలావుంటే అద్వానీ బాబ్రీ మసీదు కేసు కూడా వెంటాడుతోంది. ఈ కేసు పునర్‌విచారణకు సుప్రీంకోర్టు విచారించినట్టయితే ఆయన రోజు వారీ విచారణను ఎదుర్కొనే అవకాశం ఉంది. అదేసమయంలో ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కూడా తాను ప్రెసిడెంట్ రేసులో లేనని ఇంతకు ముందే స్పష్టం చేశారు. 

వెబ్దునియా పై చదవండి