కానిస్టేబుల్స్ డ్రైవ్ .. దళిత యువకుల ఛాతిపై ఎస్సీ, ఎస్టీ అంటూ రాతలు

సోమవారం, 30 ఏప్రియల్ 2018 (15:37 IST)
భారతీయ జనతా పార్టీ పాలిత రాష్ట్రాల్లో మధ్యప్రదేశ్ రాష్ట్రం ఒకటి. ఇక్కడ కానిస్టేబుళ్ల పోస్టుల భర్తీ కోసం కానిస్టేబుల్స్ రిక్రూట్మెంట్ డ్రైవ్ జరుగుతోంది. ఇందులో అనేక మంది దళిత నిరుద్యోగ అభ్యర్థులు కూడా పాల్గొన్నారు. వీరి ఛాతిపై ఎస్సీ, ఎస్టీ అని రాసి వృత్తాకార గుర్తులు వేశారు. దీనిపై దేశవ్యాప్తంగా దుమారం చెలరేగుతోంది.
 
2018 సంవత్సరానికిగాను మధ్యప్రదేశ్‌లో కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌ చేపట్టారు. ఇందులో పాల్గొన్న అభ్యర్థుల ఛాతీపై ఎస్సీ, ఎస్టీ అని రాశారు. అభ్యర్థులపై కుల 'ముద్ర' వేయడంతో దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తమమవుతున్నాయి. దీంతో ఆ రాష్ట్ర రాష్ట్ర పోలీస్ శాఖ కూడా స్పందించి 'ఇది చాలా తీవ్రమైన అంశమని, దీనిపై దర్యాప్తు'నకు ఆదేశించినట్టు చెప్పుకొచ్చింది. 
 
కాగా, ఈ సంఘటనపై కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ బీజేపీపై విరుచుకపడ్డారు. "బీజేపీ ప్రభుత్వ జాత్యాహంకార వైఖరితో భారతదేశ ఛాతీని కత్తితో చీల్చారు. మధ్యప్రదేశ్ యువకుల గుండెలపై ఎస్సీ, ఎస్టీ అని రాసి భారత రాజ్యాంగపై దాడి చేశారు. ఇదే బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఆలోచన. ఆ ఆలోచన దళితుల మెడకు ఉచ్చులా ఎప్పుడూ బిగించే ఉంటుంది. వారి శరీరంలో విష బీజాన్ని నాటి, గుడిలోకి రాకుండా చేశారు. కానీ మేము ఇలాంటి ఆలోచనను ఓడించాము" అంటూ తన ట్విట్టర్ ఖాతాలో ఓ కామెంట్ పోస్ట్ చేశారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు