No respect, no fear for law : Nitin Gadkari on rising road accident deaths దేశ చట్టాలంటే ప్రజలకు భయంభక్తీ లేకుండా పోయిందని కేంద్ర రవాణా శాఖామంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. అదేసమయంలో రోడ్డు ప్రమాదాల కారణంగా నిత్యం ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారన్నారు. ఈ ప్రమాదాల సంఖ్యను తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని తెలిపారు. వాహనదారులు, ప్రజల నిర్లక్ష్యం వల్ల బాధితుల సంఖ్య పెరుగుతూనే ఉందని, తాను కూడా బాధితుడినేని చెప్పారు.
రోడ్డు ప్రమాదాల నివారణ చర్యలపై లోక్సభలో అడిగిన ప్రశ్నకు నితిన్ గడ్కరీ బదులిచ్చారు. 'ఇక్కడ నాలుగు అంశాలు కీలకమైవని. రోడ్డు ఇంజినీరింగ్, ఆటోమొబైల్ ఇంజినీరింగ్, సమర్థంగా చట్టాల అమలు. ప్రజలకు అవగాహన కల్పించడం. ఇక్కడ సమస్య ఏంటంటే.. చట్టాలంటే ప్రజలకు భయం గానీ.. గౌరవంగానీ లేవు. రెడ్ సిగ్నల్ పడితే ఆగరు. హెల్మెట్ పెట్టుకోరు. నిన్నటికి నిన్న నా కళ్లముందే ఓ కారు రెడ్ సిగ్నల్ దాటుకుని వెళ్లిపోయింది. హెల్మెట్ ధరించని కారణంగా ఏటా కనీసం 30 వేల మంది ప్రాణాలు కోల్పోతున్నట్టు నివేదికలు చెబుతున్నాయి' అని గడ్కరీ వివరించారు.
'నేను కూడా రోడ్డు ప్రమాద బాధితుడినే. మహారాష్ట్రలో ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో నాకు యాక్సిడెంట్ కారణంగా కాలు విరిగింది. అందుకే ఈ అంశం నాకు చాలా సున్నితమైంది. రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు ప్రభుత్వం ఎంత కష్టపడుతున్నా.. యేటా 1.68 లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. చట్టాల అమలు సరిగ్గా లేకపోవడమే దీనికి కారణం. ప్రజాప్రతినిధులు, మీడియా, సమాజం నుంచి సహకారం లేకుండా వీటిని తగ్గించడం సాధ్యం కాదు. జరిమానాలు పెంచినా ప్రజలు రూల్స్ పాటించట్లేదు' అని కేంద్రమంత్రి తెలిపారు.