ఒక్కొక్కరు ఒక్కోలా పూజలు చేస్తుంటారు. కొంతమంది పూజలు చేస్తుంటే మనసు ప్రశాంతంగా, హాయిగా వుంటుంది. మరికొందరు పూజలు చేస్తూ మంత్ర తంత్రాలను జపిస్తుంటే శరీరం వణికిపోతుంది. దీనితో కొందరికి పూనకం కూడా వస్తుంది. ఇంకొందరికైతే నాలుక పిడచకట్టుకుపోయి నోట్లో నుంచి మాటలు రావు. మరికొందరికైతే వణుకుపుట్టి భయంతో పరుగులు తీస్తారు.
ఇదంతా ఎందుకయా అంటే... తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి అవుదామని అక్రమాస్తుల కేసులో జైల్లో శిక్ష అనుభవిస్తున్న శశికళ మేనల్లుడు, జయలలిత దత్తపుత్రుడు సుధాకరన్ గురించే. ఇతడు బెంగళూరులోని పరప్పన అగ్రహారం జైల్లో శిక్ష అనుభవిస్తున్న సంగతి తెలిసిందే. మరి శిక్ష నుంచి త్వరగా బయటకు రావాలంటే కాళీమాతను ప్రసన్నం చేసుకోవాలని ఎవరైనా చెప్పారో ఏమోగానీ, జైల్లో ఖాళీ మాత ఫోటోను పెట్టి పెద్దపెద్దగా మంత్రాలు జపిస్తూ తోటి ఖైదీలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాడట.