ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఘజియాబాద్‌లో ఓ వ్యక్తి చేయని నేరానికి మూడేళ్ళపాటు జైలుశిక్ష అనుభవించాడు. దీనికి కారణం అతని కుమార్తె. బంధువు ప్రోద్బలంతో తండ్రిపై కుమార్తె అత్యాచారం కేసు పెట్టింది. ఈ యువతి మైనర్ కావడంతో పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి, అరెస్టు చేశారు. అలా మూడేళ్ళుగా జైలుశిక్షను అనుభవిస్తూ వచ్చాడు. అయితే, ఆ యువతి చేసిన తప్పు తెలుసుకుని ఫిర్యాదు వెనక్కి తీసుకోవడంతో జైలుశిక్ష అనుభవిస్తున్న తండ్రి నిర్దోషిగా విడుదలయ్యాడు.
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఘజియాబాద్‌కు చెందిన ఓ మైనర్ బాలిక గతంలో తల్లి తరుపు బంధువు ఇంట్లో నివసించేది. అయితే, తండ్రిపై అత్యాచారం కేసు పెట్టాలంటూ ఆ ఇంటి యజమాని... బాలికను ఉసిగొల్పాడు. దీంతో ఆమె 2017లో ఘాజియాబాద్ జిల్లాలోని మోదీనగర్ పోలీస్ స్టేషన్‌లో తండ్రిపై తప్పుడు ఫిర్యాదు చేసింది. పాక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు.. బాలిక తండ్రిని జ్యూడీషియల్ రిమాండ్‌కు తరలించారు.
దీంతో అతడు చేయని నేరంపై జైల్లో మగ్గాల్సి వచ్చింది. ఈ కేసుపై విచారణ జరుగుతుండగా బాలిక తాజాగా అసలు విషయాన్ని బయటపెట్టింది. తల్లి తరపు బంధువు ప్రోద్బలంతోనే కేసు పెట్టానని అంగీకరించింది. బాలిక ప్రకటన ఆధారంగా కోర్టు బాలిక తండ్రిని నిర్దోషి అని ప్రకటిస్తూ శుక్రవారం నాడు తీర్పు వెలువరించింది. బాలికను రెచ్చగొట్టిన బంధువుకు ఒక నెల సాధారణ కారాగార శిక్షతో పాటూ రూ.50 వేల జరిమానా విధించింది.