సీనియర్ ఐపీఎస్ అధికారి, కర్నాటక రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీఐజీ) రామచంద్రరావు కుమార్తె, కన్నడ నటి రన్యా రావు నుంచి 14 కేజీలకు పైగా స్మగ్లింగ్ బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆమెను పోలీసులు అరెస్టు చేశారు.
ఆమె లోదుస్తుల్లో బంగారాన్ని స్మగ్లింగ్ చేస్తూ ఎయిర్ పోర్టు భద్రతా సిబ్బందికి దొరికిపోయారు. ఈ వ్యవహారంలో పలువురు ప్రముఖుల ప్రమేయం ఉన్నట్టు తెలుస్తుంది. రన్యారువుకు ఎస్కార్ట్‌గా వచ్చిన పోలీసులపై కూడా డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు దృష్టిసారించారు. ఈ స్మగ్లింగ్‌లో ఎవరెవరి పాత్ర ఉందనేదానిపై ఆరా తీస్తున్నారు. అలాగే, మనీలాండరింగ్ కేసులో ఈ నటి వద్ద ఈడీ అధికారులు ప్రశ్నించేందుకు సిద్ధమవుతున్నారు.
మరోవైపు, రన్యారావును కోర్టులో హాజరుపరచగా ఆమెకు బెంగుళూరు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఆమె విదేశాల నుంచి ఢిల్లీ మీదుగా బెంగుళూరుకు బంగారం స్మగ్లింగ్ చేస్తున్నట్టు ప్రాథమికంగా గుర్తించారు. పైగా, రెండు వారాల వ్యవధిలో ఆమె నాలుగుసార్లు బెంగుళూర్ నుంచి దుబాయ్‌కు వెళ్లి వచ్చినట్టు ఆధారాలు లభించాయి. అలాగే, ఎయిర్‌పోర్టుకు వచ్చిన ప్రతిసారి ఆమె పోలీస్ సెక్యూరిటీతో ఇంటికి వెళ్లేది. ఆమె నుంచి స్వాధీనం చేసుకున్న బంగారం విలువ రూ.12 కోట్లుగా ఉంటుందని సమాచారం.