నవీన్ చావ్లాను తొలగించండి: గోపాలస్వామి

శనివారం, 31 జనవరి 2009 (11:07 IST)
FileFILE
కేంద్ర ఎన్నికల సంఘంలోని త్రిసభ్య ప్యానెల్ నుంచి విధుల్లో పక్షపాతం చూపిస్తున్న ఎన్నికల అధికారి నవీన్ చావ్లాను తొలగించాలని ప్రధాన ఎన్నికల అధికారి ఎన్.గోపాలస్వామి రాష్ట్రపతి ప్రతిభాపాటిల్‌కు శనివారం లేఖ రాశారు. సుయోమోటాగా రాసిన ఈ లేఖను రాష్ట్రపతి.. ప్రధాని మన్మోహన్ సింగ్‌కు పంపించారు. కాదా, తన లేఖపై గోపాలస్వామి మాట్లాడుతూ.. నేను నా విధిని చేశాను. నివేదికను రాష్ట్రపతికి అందజేశాను అని ముక్తసరిగా సమాధానం ఇచ్చారు. పైపెచ్చు వివరణ ఇచ్చేందుకు నిరాకరించారు.

ఎన్నికల ప్రధానాధికారిగా విధులు నిర్వహిస్తున్న గోపాలస్వామి వచ్చే ఏప్రిల్ 20వ తేదీన పదవీవిరమణ చేయనున్నారు. ఆ స్థానాన్ని నవీన్ చావ్లా భర్తీ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. 15వ లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ మరికొద్ది వారాల్లో వెలువడనున్న నేపథ్యంలో గోపాలస్వామి ఇలా అభ్యర్థించడం గమనార్హం.

కాగా, సాటి అధికారిని సంఘం నుంచి తొలగించాలని కోరే అధికారం కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారికి లేదని పలువురు రాజ్యాంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఎన్నికల సంఘం అధికారిగా ఉంటున్న నవీన్ చావ్లా తన విధులను పక్షపాతంతో నిర్వహిస్తున్నారన్నది గోపాలస్వామి ఆరోపణ. ఇదే అంశంపై గతంలో భారతీయ జనతా పార్టీ ఆరోపణలు చేసింది.

ఈ నేపథ్యంలో గోపాల స్వామి లేఖ పెద్ద దుమారమే రేపనుంది. అబ్దుల్ కలాం రాష్ట్రపతిగా ఉన్నపుడు నవీన్ చావ్లాను 324(5) అధికరణ ద్వారా తొలగించాలని భాజపా డిమాండ్ చేసింది. ఆ తర్వాత అపెక్స్ కోర్టులో సైతం పిటీషన్ దాఖలు చేసి, ఉపసంహరించుకుంది. ఆ తర్వాత ఆయన కాంగ్రెస్ పార్టీకి దగ్గరయ్యారని ఊహాగానాలు వచ్చాయి.

కాగా, ఎన్నికల సమయం సమీపిస్తున్న తరుణంలో గోపాలస్వామి ఇలా విజ్ఞప్తి చేయడం ఆయనకే సమస్యలు తెచ్చిపెట్టే అవకాశం ఉంది. ఇకపోతే ఈసీసీలోని ముగ్గురు సభ్యుల బృందాన్ని గోపాలస్వామి సంప్రదించకుండా స్వయంగా రాష్ట్రపతికి లేఖ రాయడం మరో తప్పుగా భావిస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి