నూతన సంవత్సరం తమకు అన్ని విధాలా కలిసిరావాలని ఆకాంక్షిస్తూ ప్రతి ఏడాది జనవరి ఒకటో తేదీన భక్తులందరూ తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం ప్రతీతి. కానీ ఈ ఏడాది భక్తులు 31వ తేదీ అర్థరాత్రి సేవకు నోచుకోలేరు.
గురువారం చంద్రగ్రహణం సందర్భంగా స్వామివారి ఏకాంత సేవ తర్వాత రాత్రి 7 గంటల నుంచి ఆలయ ముఖద్వారాన్ని మూసివేస్తారు. గ్రహణం విడిచిన తర్వాత శుక్రవారం (జనవరి 1) వేకువజామున 1.45 గంటలకు తిరిగి తిరుమలేశుని ఆలయాన్ని తెరుస్తారు. తదనంతరం తిరుప్పావై, శాస్త్రోక్త పూజాకార్యక్రమాలు, అభిషేకం, సాయంత్రం సహస్రదీపాలంకార సేవలను యథావిధిగా నిర్వహిస్తారు.
31 శ్రీశైలం ఆలయం మూసివేత: ఈ నెల 31న (గురువారం) చంద్రగ్రహణం సందర్భంగా శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయాన్ని కూడా మూసివేయనున్నారు. ఆ రోజు సాయంత్రం 6.30 గంటలకు ఆలయాన్ని మూసివేసి, గ్రహణం విడిచిన తర్వాత సంప్రోక్షణ నిర్వహిస్తామని ఈవో గోపాలకృష్ణారెడ్డి అన్నారు.
FILE
అందువల్ల జనవరి 1వ తేదీ తెల్లవారుజామున 4.30 గంటల వరకు భక్తులకు ఆలయ ప్రవేశం ఉండదని, ఉదయం ఆరు గంటల నుంచి ఆలయాలను తెరుస్తామని ఆయన చెప్పారు. అదే రోజు సాయంత్రం నుంచి ఆర్జిత సేవలు ప్రారంభమవుతాయని గోపాలకృష్ణారెడ్డి అన్నారు.