టెన్నిస్, బ్యాడ్మింటన్ ఈ ఆటల్లో దాదాపు కొంత వరకు పోలికలుంటాయి. అదే విధంగా తేడాలు చాలానే ఉంటాయి. అయితే దేని ప్రత్యేకత దానిదే. దేనికి ఏదీ తీసిపోదు. టెన్నిస్‌కు కండబలంతో పాటు.. బుద్ధి బలమూ కావాలి... కానీ బ్యాడ్మింటన్‌కు బుద్ధబలమే ప్రధానం. అదే బ్యాడ్మింటన్‌లో ప్రత్యేకం.
చేతి మణికట్టుతో ఇంద్రజాలం చేస్తే.. ప్రత్యర్థి ఎవరైనా సరే మట్టికరవాల్సిందే. టోర్నీ ఏదైనా సరే టైటిల్ వశం అవ్వాల్సిందే. దీన్ని బట్టి బ్యాడ్మింటన్ ఎంత ఆసక్తిగా.. ఉంటుందో వేరే చెప్పాల్సిన పనిలేదు. నిజానికి బ్యాడ్మింటన్ అంటే ఇంతకుముందు భారత్‌లో పెద్దగా ప్రాధాన్యముండేది కాదు.
అది అందరికీ తెలిసిన విషయమే. అలాంటి పరిస్థితులల్లో.. ప్రత్యేకించి దేశంలో క్రికెట్ రాజ్యమేలుతున్న తరుణంలో ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ టోర్నీ ప్రస్తుతం అందరి అభిమానాన్ని చూరగొనే స్థాయికి చేరుకుందంటే దాని వెనుక భారత షట్లర్ల కొన్నేళ్ల శ్రమ, పట్టుదల, దీక్ష దాగి ఉన్నాయి.
బ్యాడ్మింటన్‌ను కెరీర్‌గా ఎంచుకున్న వారు ఎవరైనా సరే తప్పనిసరిగా ఒలింపిక్స్ పతకం తర్వాత తమ కెరీర్‌లో గెలవాలనుకునే టైటిల్ ప్రపంచ బ్యాడ్మింటనే. హైదరాబాద్‌లోని గచ్చిబౌలీ స్టేడియంలో రేపటి నుంచి ఈ టోర్నీ ప్రారంభమవుతున్న సందర్భంగా దీనికి సంబంధించిన గత చరిత్రను మీకందిస్తున్నాం.
బ్యాడ్మింటన్ చరిత్ర ప్రపంచ బ్యాడ్మింటన్ టోర్నీ తొలిసారి 1977లో ప్రారంభమైంది. ప్రారంభంలో ప్రతి మూడేళ్లకు ఓ సారి ఈ టోర్నీని నిర్వహించే వారు. 1983 సంవత్సరం వరకు ఈ పోటీలు ఇలాగే జరిగేవి. ఆ తర్వాత నుంచి ప్రతి రెండేళ్లకు ఒక సారి నిర్వహిస్తున్నారు.
ఆ తర్వాత మళ్లీ దీన్ని మారుస్తూ.. 2005 నుంచి ప్రతి ఏడాది నిర్వహిస్తున్నారు. అయితే ఒలింపిక్స్ ఉండే సంవత్సరంలో మాత్రం ఈ పోటీలుండవు. ఇప్పటి వరకు మొత్తం 16 ఎడిషన్‌లు పూర్తయ్యాయి. హైదరాబాద్‌లో నిర్వహించేది 17వ ఎడిషన్.
ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్)లోని సభ్యదేశాలన్నీ ఈ పోటీల్లో పాల్గొంటాయి. పురుషుల సింగిల్స్, మహిళల సింగిల్స్, పురుషుల డబుల్స్, మహిళల డబుల్స్, మిక్స్‌డ్ డబుల్స్ విభాగాల్లో పోటీలు జరుగుతాయి.
ప్రతి విభాగంలో విజేతలుగా నిలిచిన వారికి టైటిల్‌తో పాటు స్వర్ణ పతకాన్ని అందజేస్తారు. రెండో స్థానంలో నిలిచిన వారికి రజతం, మూడో స్థానంలో నిలిచిన వారికి కాంస్య పతకాలను ఇస్తారు. ఈ టోర్నీ ఇప్పటి వరకు అత్యధికంగా మూడు సార్లు డెన్మార్క్‌లోని కొపెన్‌హెగన్‌లో జరిగింది.
ప్రపంచ బ్యాడ్మింటన్‌లో ఆసియా దేశాలదే ఆధిపత్యం. కానీ ఈ పోటీలకు ఇప్పటివరకు నాలుగు సార్లు మాత్రమే ఆసియా దేశాలు ఆతిథ్యమిచ్చాయి. యూరప్‌లో పది సార్లు, అమెరికా, కెనడాల్లో ఒక్కోసారి జరిగింది. కాగా, వచ్చే ఏడాది ఈ ప్రపంచ ఛాంపియన్‌షిప్ ఫ్రాన్స్‌లో జరగనుంది.