సనాతన ధర్మం గొప్పతనాన్ని చాటిచెప్పేలా హరి హర వీరమల్లు : జ్యోతి కృష్ణ

దేవీ

బుధవారం, 28 మే 2025 (16:58 IST)
Jyothi Krishna, A.M. Ratnam, keeravani, A. Dayakar Rao, Jyothi Krishna
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చారిత్రాత్మక యోధుడిగా కనువిందు చేయనున్న ప్రతిష్టాత్మక చిత్రం 'హరి హర వీరమల్లు'. ఎ.ఎం. రత్నం సమర్పణలో ఎ. దయాకర్ రావు నిర్మించారు. ఈ చిత్రానికి క్రిష్ జాగర్లమూడి, జ్యోతి కృష్ణ దర్శకత్వం వహించారు. ఎం.ఎం. కీరవాణి సంగీతం సమకూర్చారు. నిధి అగర్వాల్ కథానాయికగా నటించిన  ఈ సినిమాో తాజాగా ఈ చిత్రం నుంచి మరో గీతం 'తార తార' విడుదలైంది. ఈ పాట ఆవిష్కరణ కార్యక్రమాన్ని చిత్ర బృందం చెన్నైలో ఘనంగా నిర్వహించింది.
 
నిర్మాత ఎ.ఎం. రత్నం మాట్లాడుతూ, "చెన్నైతో నాకు మంచి అనుబంధం ఉంది. పలు గొప్ప తెలుగు సినిమాలను తమిళ ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాను. అలాగే పలు తమిళ సినిమాలను తెలుగులో ప్రేక్షకులకు అందించాను. ముఖ్యంగా 'ఇండియన్' చిత్రం నిర్మాతగా నాకు ఎంతో పేరు తీసుకొచ్చింది. సినిమా ద్వారా వినోదంతో పాటు, ఏదో ఒక సందేశం ఇవ్వాలనేది నా తపన. 90 శాతానికి పైగా నా సినిమాలు విజయం సాధించాయి. నా కుమారుడు జ్యోతికృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పాలి. చిన్న వయసులోనే గొప్ప కథలతో ప్రముఖ దర్శకులను మెప్పించాడు. ఇప్పుడు పాన్ ఇండియా చిత్రం హరి హర వీరమల్లు బాధ్యతను క్రిష్ గారి దగ్గర నుంచి తీసుకొని, సినిమా అద్భుతంగా రావడంలో కీలక పాత్ర పోషించాడు. ఐదు సంవత్సరాలు ఎంతో కష్టపడి ఈ సినిమాని రూపొందించాము. కీరవాణి గారు అద్భుతమైన సంగీతం అందించారు. ఈ సినిమా కోసం ఐదేళ్లు వెచ్చించిన నిధి అగర్వాల్ కి ప్రత్యేక కృతఙ్ఞతలు." అన్నారు.
 
చిత్ర సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి మాట్లాడుతూ, "ఎ.ఎం. రత్నం గారి ముఖంలో నేను కోపం ఎప్పుడూ చూడలేదు. శాంతంగా, చిరునవ్వుతో ఉంటారు. ఆయన రియల్ హీరో. హరి హర వీరమల్లు సినిమా ఘన విజయం సాధిస్తుందని నేను నమ్ముతున్నాను. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి సినిమా అంటే సంగీతంలో పవర్ కనిపించాలి. సంగీత విషయంలో జ్యోతికృష్ణ నాకెంతో స్వేచ్ఛను ఇచ్చాడు. ఈ సినిమా కోసం ఎంతో కష్టపడ్డాడు. ఈ చిత్రం ఘన విజయం సాధించి.. ఎ.ఎం. రత్నం గారికి, జ్యోతికృష్ణకి సినిమాకి పని చేసిన ప్రతి ఒక్కరికీ మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నాను." అన్నారు.
 
చిత్ర దర్శకుడు జ్యోతి కృష్ణ మాట్లాడుతూ, "అజిత్ గారి సూచన మేరకు నాన్నగారి లెగసీని కంటిన్యూ చేయాలనే ఉద్దేశంతో.. డైరెక్షన్ ను పక్కనపెట్టి, కొన్నేళ్లు ప్రొడక్షన్ వైపు ఉన్నాను. అదే మాట పవన్ కళ్యాణ్ గారు. ఎ.ఎం. రత్నం గారి పేరు నిలబెట్టాలని చెప్పారు.

మొఘల్ సామ్రాజ్యం నేపథ్యంలో ఈ చిత్ర కథ ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారు పోషించిన వీరమల్లు పాత్ర మన సంస్కృతి, సంప్రదాయాలకు అడ్డం పట్టేలా ఉంటుంది. సనాతన ధర్మం గొప్పతనాన్ని చాటిచెప్పేలా ఉంటుంది. ఆరోగ్యం బాలేనప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు ఈ సినిమా కోసం పనిచేశారు. సాంకేతికంగా ఈ సినిమా ఉన్నతంగా ఉంటుంది. అంతర్జాతీయ స్థాయి గ్రాఫిక్స్ కంపెనీ ఈ చిత్రం కోసం పని చేశాయి. భారీస్థాయిలో ఎక్కడా రాజీ పడకుండా సినిమాని రూపొందించాము. పవన్ కళ్యాణ్ గారు, నిధి అగర్వాల్ మధ్య కెమిస్ట్రీ చక్కగా కుదిరింది. నాజర్ గారు, సత్య రాజ్ గారు వంటి సీనియర్ నటులతో కలిసి పని చేయడం సంతోషంగా ఉంది. కీరవాణి గారు, తోట తరణి గారు, నాన్న రత్నం గారు లాంటి లెజెండ్స్ తో పని చేయడం గౌరవంగా భావిస్తున్నాను. 'హరి హర వీరమల్లు'కి పార్ట్ 2 కూడా ఉంది. ఈ చిత్రం అందరి అంచనాలను మించేలా ఉంటుందని, మన దేశంలో గొప్ప చిత్రాలలో ఒకటిగా నిలుస్తుందని నమ్ముతున్నాను." అన్నారు.  
 
చిత్ర కథానాయిక నిధి అగర్వాల్ మాట్లాడుతూ,రత్నం గారి కోసం ఈ సినిమా ఘన విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జ్యోతి కృష్ణ గారు లాంటి దర్శకుడితో పని చేయడం సంతోషంగా ఉంది. నటీనటుల నుంచి సులువుగా మంచి నటనను రాబట్టుకుంటారు. కీరవాణి గారు సంగీతం అందించిన సినిమాలో భాగం కావడం గౌరవంగా భావిస్తున్నాను. పవన్ కళ్యాణ్ గారి చిత్రంలో భాగం కావడం అదృష్టంగా భావిస్తున్నాను. చిత్ర బృందమంతా ఎంతో కష్టపడి హరి హర వీరమల్లును రూపొందించింది. ఈ సినిమా మీ అందరికీ నచ్చుతుందని నమ్ముతున్నాను." అన్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు