ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఈ మధ్యకాలంలో వరుస అగ్నిప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యంగా, వాహనాల్లో ఈ మంటలు చెలరేగుతున్నాయి. దీంతో వాహనచోదకులు ఆందోళనకు గురవుతున్నారు. తాజాగా ఈ జిల్లాల్లో వేర్వేరు ప్రాంతాల్లో రెండు వాహనాల్లో మంటలు చెలరేగినా ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.
ములుగు జిల్లా కేంద్రంలోని గట్టమ్మ దేవాలయ సమీపంలో టాటా ఏస్ వాహనంలో మంటలు వచ్చాయి. గమనించిన డ్రైవర్ వాహనం దిగి ప్రాణాలు కాపాడుకున్నారు. నర్సంపేట నుంచి ములుగు జిల్లా దేవగిరిపట్నం గ్రామానికి బియ్యం తీసుకొచ్చేందుకు టాటా ఏస్‌లో డ్రైవర్ వంశీతోపాటు అతని మిత్రులు సంతోష్, విజేందర్ కలిసి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
మరోవైపు, జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం ప్రధాన రహదారి మార్గంలో ప్రమాదవశాత్తు కారు దగ్ధమైంది. ధన్వాడ గ్రామం నుంచి కాటారం వైపు కారు వెళ్తున్న క్రమంలో వ్యవసాయ శాఖ కార్యాలయం సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది.