విదేశీ గడ్డపైనే ధోనీకి అసలైన సవాళ్లు : గంగూలీ

ఆదివారం, 23 నవంబరు 2008 (04:21 IST)
టీం ఇండియా కెప్టెన్‌గా, విజయాలకు చిరునామాగా మారిన కెప్టెన్ మహేంద్రసిగ్ ధోనీకి విదేశాల్లో ఆడే సిరీస్‌లలోనే అసలు పరీక్ష ఎదురుకానుందని మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ పేర్కొన్నాడు. కెప్టెన్‌గా ఏడాదిగా రాణిస్తున్న ధోనీకి విదేశీ సిరీస్‌ల రూపంలో అసలైన పరీక్ష ప్రారంభం కానుందని గంగూలీ వ్యాఖ్యానించాడు.

భారత్‌ను సొంతగడ్డపై ఓడించడం చాలా కష్టమని ప్రతి జట్టూ భావిస్తుంది. దీంతోపాటు సొంతగడ్డపై భారత్ సైతం బాగానే రాణిస్తుంది అని గంగూలీ పేర్కొన్నాడు. అయితే విదేశాల్లో ఆడే మ్యాచ్‌లలో నెగ్గడమే ప్రస్తుతం భారత్ ముందున్న సవాల్ అని గంగూలీ పేర్కొన్నాడు.

అదేసమయంలో తాను కెప్టెన్‌గా ఉన్నప్పటి విషయాలను గుర్తు చేసుకుంటూ తన సారధ్యంలోని భారత జట్టు ఆస్ట్రేలియాను వారి సొంతగడ్డపైనే ముప్పు తిప్పలు పెట్టడం ఎప్పటికీ మర్చిపోలేని సంఘటన అని గంగూలీ అన్నాడు. గత పదేళ్లలో ఆస్ట్రేలియాను వారి సొంతగడ్డపై అంతలా వణికించిన జట్టు భారత్ మాత్రమేనని గంగూలీ పేర్కొన్నాడు.

వెబ్దునియా పై చదవండి