మహబూబాబాద్ : పెద్ద నోట్ల రద్దు ప్రజల్లో తీవ్ర అసహనాన్ని కలిగిస్తోంది. చిల్లర దొరక్క, ఉన్న నోట్లు అక్కరకు రాక ప్రజలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. మహబూబ్ నగర్ జిల్లా దంతాలపల్లిలో అసహనంతో కరెన్సీ నోట్లు చించివేసిన సంఘటన జరిగింది. మండల కేంద్రంలో కరెన్సీ నోట్లు చించివేసి... చిందరవందరగా పోసిన ఘటన తీవ్ర కలకలం రేపింది.
స్థానిక సీతారామాంజనేయ స్వామి ఆలయ ఆవరణలో రూ.12,000 విలువైన కరెన్సీ నోట్ల ముక్కలు పడి ఉన్నాయి. ఇందులో రద్దయిన రూ.500 నోట్లు 16, కొత్తగా ముద్రించిన రూ.2,000 నోట్లు రెండు ఉన్నాయి. ఆలయంలో కరెన్సీ ముక్కలు ముక్కలుగా చించి పడేసిన నోట్లను స్థానికులు పరిశీలించి, పోలీసులకు సమాచారం అందించారు. ఎవరో భక్తుడు కరెన్సీ నోట్ల రద్దుపై తీవ్ర అసహనంతో ఇలా చేసి, తాను నమ్మిన సీతారామాంజనేయ స్వామికి మొరపెట్టుకున్నాడని భావిస్తున్నారు. మోదీ నోట్ల రద్దు చర్య అంతగా విసిగించిందని పేర్కొంటున్నారు.